హైదరాబాద్, వ్యవసాయ యూనివర్సిటీ జూన్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, అంతర్జాతీయ వ్యవసాయ నిపుణుడు సమరేండు మహంతితో కలిసి రచించిన తెలంగాణ వ్యవసాయం-2047 పుస్తకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. మంగళవారం సచివాలయంలో జరిగిన వ్యవసాయ శాఖ సమీక్ష సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వీసీ అల్దాస్ జానయ్య రచించిన ‘ఇందిరాగాంధీ ఆన్ ఆర్కిటెక్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్’ పుస్తకాన్ని సీఎం విడుదల చేశారు. అనంతరం అల్దాస్ జానయ్యని సీఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.
వ్యవసాయ వర్సిటీలో ఖాళీగా ఉన్న సుమారు 550 బోధనా సిబ్బంది పోస్ట్‌లను భర్తీ చేయడానికి సీఎం అంగీకరించారని
వీసీ జానయ్య వెల్లడించారు. సంబంధిత ఫైల్‌ను వెంటనే ఆమోదించాలని ఆర్థికశాఖను సీఎం ఆదేశించారని తెలిపారు.
ఈ ఖాళీలను పారదర్శకంగా భర్తీ చేస్తామని వెల్లడించారు. ఖాళీల భర్తీకి అంగీకరించిన సీఎంకు ఈ సందర్భంగా వీసీ జానయ్య ధన్యవాదాలు తెలియజేశారు.