హైదరాబాద్, జూలై10 (నమస్తే తెలంగాణ)/ఖమ్మం, జూలై 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కన్నెపల్లి నుంచి కాళేశ్వరం నీటిని ఎత్తిపోసేది లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఖమ్మం జిల్లా మధిర వేదికగా తేల్చిచెప్పారు. మేడిగడ్డలో నీళ్లు నింపితే భద్రాచలం మునిగిపోతుందంటూ మరో అడ్డగోలు ప్రచారానికి తెరతీశారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని చింతకాని మండలం జగన్నాథపురంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులతో కలిసి రైతుభరోసా చివరి విడత గా 1.44 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 1,009.15 కోట్ల నిధులను ముఖ్యమంత్రి విడుదల చేశారు. రైతులకు ఈ-పట్టాదారు పా సుపుస్తకాలను జారీచేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మరోసారి బీఆర్ఎస్పై అసత్య ఆరోపణలకు దిగారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీమంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుపై నోరుపారేసుకొన్నారు. కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలని బీఆర్ఎస్ చేస్తున్న డిమాండ్‌పైనా గతంలో మాదిరిగానే అసంబద్ధ వాదనలకు దిగారు.
‘మొన్న కేటీఆర్ కన్నెపల్లి పోయిండు. మేడిగడ్డల నీళ్లు నింపండి.. కన్నెపల్లి పంపులు ఎత్తండి అని అన్నడు. ఒకవేళ మేడిగడ్డల గేట్లు దించి నీళ్లు నిలిచేట్టు చేస్తే ఇప్పటికే కుంగిపోయింది. రేపు తెగిపోతే భద్రాచలం రాముడే ఉండడు. ఖమ్మం జిల్లాల 44 ఊర్లు కొట్టుకుపోతయ్. మీ రాజకీయాల కోసం మేడిగడ్డను నింపాలి. భద్రాచలాన్ని కొట్టుకుపోయేలా చె య్యాల్నా. అందుకే తాము ఆ ప్రయత్నం చేయలేదు’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. అంతేకాదు కేటీఆర్, హరీశ్‌రావుపై వ్యక్తిగత దూషణలకు దిగుతూ రెచ్చిపోయి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనంతో ఏర్పాటుచేసిన ఈ సభను కూడా ఎప్పటిలాగేనే ముఖ్యమంత్రి రాజకీయ ప్రగల్భాలకు వేదికగా మలుచుకున్నారు. తెలంగాణలో అందరూ భావిస్తున్నట్టుగా శాసనసభ ఎన్నికలు 2028లో జరుగవని, 2029 మే నెలలో జరుగుతాయని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. లోక్‌సభ స్థానాల సంఖ్య 17 నుంచి 26కు పెరుగుతుందని, 119 శాసనసభ స్థానాలు 182కు పెరుగుతాయని చెప్పుకొచ్చారు. ఆయా స్థానాల్లో 20 లోక్‌సభ స్థానాలు, 117 శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచి తీరుతుందని జోస్యం చెప్పారు. భద్రాచలం రాముడి సాక్షిగా చెప్తున్నానని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీయే గెలుస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీతో జరిగే కురుక్షేత్ర యుద్ధంలో తాము విజయం సాధిస్తామని జోస్యంచెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అనే విషయాన్ని 36 నెలల ముందే చెప్పడం తనకు మాత్రమే సాధ్యమవుతుందని తెలిపారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ప్రజాసంక్షేమ పథకాలు తమ ప్రభుత్వం రద్దు చేయలేదని, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, రైతుబంధు వంటి పథకాలను కొనసాగిస్తున్నామని రేవంత్‌రెడ్డి చెప్పారు. రైతుల కోసం రైతుభరోసా, రుణమాఫీ, బీమా, గిట్టుబాటు ధరలు, సన్నవడ్లకు బోనస్, ఉచిత కరెంట్, నష్టపరిహారం తదితర వాటికింద గడిచిన 30 నెలల్లో 1లక్ష 70 వేల కోట్లు ఖర్చు చేశామని గొప్పలు చెప్పారు. సగటున ప్రతి నెలా రూ.5,500 కోట్లు రైతు సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో ప్రజలకు ఉపయోగపడే పథకాలన్నీ కొనసాగిస్తున్నామని వివరించారు. ప్రభుత్వానికి మక్కజొన్నలు విక్రయించిన రైతుల ఖాతాల్లో రూ.3,504 కోట్లు జమ చేస్తున్నట్టు ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విజ్ఞప్తి మేరకు మధిరలో ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీలు రఘురాంరెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, బలరాంనాయక్, ఎమ్మెల్యేలు నవీన్‌యాదవ్, శంకర్ మనోహర్‌రెడ్డి, రాందాస్ నాయక్, వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, మట్టా రాగమయి తదితరుల పాల్గొన్నారు.
అన్నం తినోటోడు ఎవడైనా ఎన్నికలు ఎన్నడుంటయో తెల్వకుంట, ఎవడు పోటీచేస్తడో తెల్వకుంట, ఏ రిజర్వేషన్ ఉంటదో తెల్వకుం ట, ఎన్ని సీట్లు పెరుగుతయో తెల్వకుంట, ఎన్నికల్లో ఏం జెప్తమో తెల్వకుంట ఎన్నికల సర్వే చేస్తే ఎవడు గెలుస్తడో ఎట్ల నిర్ణయిస్తం.
మయూరి సెంటర్, జూలై 10: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్న ‘రైతు ఆశీర్వాద సభ’కు రాష్ట్రవ్యాప్తంగా అన్ని రీజియన్ల నుంచి ఆర్టీసీ బస్సులను భారీ ఎత్తున తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల నుంచి 3,576 బస్సులను వినియోగించి ఖమ్మం జిల్లాలోని అన్ని మండలాల్లో గ్రామాల వారీగా బస్సులను పంపించారు. ఆయా బస్సుల్లో జనం సరిపడా లేకపోకపోయినా సభకు సగం ఖాళీ బస్సులనే తీసుకొనిపోయారు. కానీ ఆయా బస్స్టాండ్లలో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి సభకు ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ నుంచి సుమారు 80 బస్సులను కేటాయించడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
చింతకాని, జూలై 10: ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం రేవంత్‌రెడ్డి సభా ప్రాంగణానికి చేరుకొని కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం మధిర సత్తుపల్లి, పాలేరు, వైరా తదితర ప్రాంతాల నుంచి రైతులను బస్సుల ద్వారా ముందుగానే తరలించారు. సాయంత్రం 4 గంటలు దాటినా సభ ప్రారంభంకాలేదు. దీంతో ఎండలో, ఉకపోతతో గంటల తరబడి వేచి ఉన్న రైతులు చివరికి అసహనానికి గురయ్యారు. సీఎం ప్రసంగం ప్రారంభమయ్యేలోపే చాలామంది రైతులు సభా ప్రాంగణం నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి ప్రసంగించే సమయానికి సభా ప్రాంగణంలో ఖాళీ కుర్చీలే ఎక్కువగా దర్శనమిచ్చాయి.
చింతకాని, జూలై 10: చింతకాని మండల జగన్నాథపురంలో జరిగిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ప్రసంగిస్తున్న సమయంలో జర్నలిస్టులు, విద్యార్థులు తమ సమస్యలు తీర్చాలని కోరుతూ ప్లకార్డుల చేతబట్టి నిరసన తెలిపారు. రూ.12 వేల కోట్ల స్కాలర్షిప్పులు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

తమకు ఇండ్లస్థలాలు, తదితర డిమాండ్లు పరిష్కరించాలని జర్నలిస్టులు లేచి నిలబడి ప్లకార్డులతో డిమాండ్ చేశారు. విద్యార్థులు, జర్నలిస్టులు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. గంధసిరి గ్రామానికి చెందిన ఓ మహిళ తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ ప్లకార్డుతో నిరసన వ్యక్తంచేసింది. సభలో కొందరు వీఆర్ఏలు తమ సమస్యలను ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.