హనుమకొండ, జూన్ 18 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలవుతున్నా నేటికీ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని, ఈ దివాలాకోరు సర్కార్‌పై పోరాటానికి సిద్ధం కావాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరెడ్డి పిలుపునిచ్చారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయని సీఎం రేవంత్‌రెడ్డి విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థి, నిరుద్యోగులను ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి రూపొందించిన ‘రాకేశ్‌రెడ్డి ఈ-క్లాస్ యాప్’ను గురువారం హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, ప్రొఫెసర్ తిరునహరి శేషు, న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ నవీన్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సుకుమార్‌తో కలిసి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. గత కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని శాఖల్లో కలిపి 1.67 లక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా ఇవ్వడంతోపాటు పరోక్షంగా ప్రైవేట్ రంగంలో దేశంలో ఎన్నడూ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని ప్రైవేట్ కంపెనీలు తరలి వెళ్లే పరిస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. రెండేండ్లకోసారి పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయడం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనవాయితీగా ఉండేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 30 నెలల కావొస్తున్నా ఒక పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఇప్పటివరకు ఏ ఒక యూనివర్సిటీలోనూ అధ్యాపక పోస్టులు భర్తీ చేయడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో మాట్లాడిన కోదండరాం, తీన్మార్ మల్లన్న, ఆకునూరి మురళి, రియాజ్ ఇప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ సైతం దేశంలో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు చేసిన మోసంపై యువతరం ఏకమై పిడికిలెత్తి తిరుగబడాలని పిలుపునిచ్చారు.