Revanth Reddy | హైదరాబాద్, మార్చి12(నమస్తే తెలంగాణ): ‘ఎమ్మెల్యేల బలముంటేనే సీఎం అయినా, మంత్రులైనా ఉంటారు. మీ అందరి ఆశీర్వాదం నాకుంటే నేను మరో 20 ఏండ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతా’ అని సీఎం రేవంత్‌రెడ్డి సీఎల్పీ సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్టు తెలిసింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బుధవారం సీఎల్పీ సమావేశం జరిగింది. ప్రతిపక్ష నేత కేసీఆర్ సమావేశాలకు హాజరవుతున్న నేపథ్యంలో ఆయనను ఎదుర్కోవడానికి సమన్వయంతో ముందుకుపోవాలని సీఎం ఈ సందర్భంగా సభ్యులకు సూచించినట్టు తెలిసింది. ఇందుకోసం ప్రతి ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి చొప్పున సమన్వయ బృందం ఏర్పాటు చేస్తామని, పార్లమెంటు తరహాలో రోజుకు మూడుసార్లు హాజరు తీసుకుంటామని, ప్రతి సభ్యుడు 100 శాతం హాజరు కలిగి ఉండాలని హెచ్చరించినట్టు తెలిసింది. ప్రతిపక్షాలు ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించినా మిగతా అందరూ స్పందించాలని చెప్పినట్టు సమాచారం. మంత్రులపైన ఫిర్యాదులు వస్తున్నాయని, మంత్రులు మాత్రమే నిధులను తీసుకెళ్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని ఈ సందర్భంగా సీఎం అన్నట్టు తెలిసింది.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తొలిరోజున ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులకు దీటుగా మన సభ్యుల స్పందన లేదని లేదని మంత్రులు, ప్రభుత్వ విప్‌లపై సీఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తిని వ్యక్తంచేసినట్టు సమాచారం. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తుండగా, మధ్యలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేచి నిలబడి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారని, మన సభ్యులెవరూ వారిని అడ్డుకునే ప్రయత్నమే చేయలేదని మంత్రులు, విప్‌లపై సీఎం అసంతృప్తిని వ్యక్తంచేసినట్టు తెలిసింది. ప్రతిపక్షాలు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం సహజమని, వారితో మనం వాదనకు దిగితే గవర్నర్ ప్రసంగం అర్థాంతరంగా ఆగిపోతుందంటూ సీఎం వ్యాఖ్యలపై సీనియర్ మంత్రి ఒకరు బదులిచినట్టు సమాచారం. దీంతో మరో అంశం మీదికి టాపిక్‌ను డైవర్ట్ చేసినట్టు తెలిసింది.
సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం సూచనలు చేస్తుండగానే, కాంగ్రెస్ సీనియర్ నేత, జానారెడ్డి కుమారుడు, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి సమావేశం నుంచి బయటకు వెళ్లినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తీరుపై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం. ‘నేను మాట్లాడుతున్నా కదా. మీరు బయటకెలా వెళ్తారు?’ అని సహచర సభ్యులను ఉద్దేశించి అన్నట్టు తెలిసింది. ఒకవైపు తాను మాట్లాడుతుంటే, జయవీర్ అలా వెళ్తున్నారు. ఇంత నాన్ సీరియస్‌గా ఉంటే ఎలా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. తనకు తెలియకుండా జయవీర్‌కు ఏ పనులూ చేయవద్దని మంత్రులను ఆదేశించినట్టు సమాచారం. క్రమశిక్షణతో మెలిగితేనే ఎవరికైనా ఫ్యూచర్ ఉంటుందని క్లాస్ తీసుకున్నట్టు తెలిసింది.
‘కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్తో టచ్‌లోకి పోతున్నట్టు తెలిసింది. అది మీకే నష్టం’ అంటూ ఎమ్మెల్యేలను సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించినట్టు తెలిసింది. ‘బీఆర్ఎస్ పట్ల సాఫ్ట్ కార్నర్‌తో ఉంటే మీ మీద వాళ్లు పోటీ అభ్యర్థిని నిలబెట్టరని కలలు కంటున్నరేమో, వాళ్ల గురించి మీకు చాలా తక్కువ తెలుసు’ అని సీఎం అన్నట్టు సమాచారం. రాజకీయాలంటే పిల్లలాట కాదని, వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలో అనే ప్లాన్‌తో పనిచేయాలని ఎమ్మెల్యేలకు సీఎం హితబోధ చేసినట్టు తెలిసింది. నిధులు రావడం లేదని ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్టు తన దృష్టికి వచ్చిందని, కొన్ని సమస్యలు ఉన్నమాట నిజమేనని, త్వరలో జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో లంచ్ సమావేశలు పెట్టి సమస్యలు పరిష్కరిస్తామని, కానీ ఎమ్మెల్యేలు ఎవరూ డిన్నర్ సమావేశాలు పెట్టుకోవద్దని సూచించినట్టు తెలిసింది. అలాంటి వారిపై కఠనంగా ఉంటామని హెచ్చరించినట్టు సమాచారం. నియోజకవర్గ నిధుల సర్దుబాటుపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్టు తెలిసింది.
ప్రభుత్వంలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేదనే విషయం కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో మరోసారి బహిర్గమైనదని కాంగ్రెస్ శ్రేణులే అంటున్నాయి. ఒకవైపు సభలో సభ్యులంతా సమన్వయంతో ముందుకెళ్లాలని సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేస్తుండగానే, మరోవైపు సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు తెలిసింది. సీఎం సూచనలకు మంత్రులు మధ్యలో అడ్డు తగిలి అలా చేయడం కుదరదనే అభ్యంతరాలను వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వ సామర్థ్యంపైనే అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.