హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమంలోనూ, రాష్ట్ర నిర్మాణంలోనూ వెన్నెముకగా నిలిచిన ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు హక్కుగా అందాల్సిన బెనిఫిట్స్ సకాలంలో అందించక కాంగ్రెస్ సర్కారు మానసిక వేధింపులకు గురిచేస్తున్నదని శాసనమండలి విప్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు. ‘ఒక ఉద్యోగి తన 35-40 ఏండ్ల జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేసి, రిటైర్మెంట్ రోజున ప్రశాంతంగా ఇంటికి వెళ్లాల్సింది పోయి.. అప్పుల వాళ్లకు భయపడి అర్ధరాత్రి ఇల్లు వదిలి పారిపోయే దుస్థితిని ఈ ప్రభుత్వం కల్పించిందని మండిపడ్డారు. ఇది ప్రజాపాలన కాదు, పేదల కన్నీళ్లు తుడవలేని కరోటక పాలన అని ఆదివారం ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు.
పెన్షనరీ బకాయిలు అందక, ఆర్థిక ఇబ్బందులు, మానసిక వేదనతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 36 మంది పెన్షనర్లు మరణించడం అత్యంత దారుణమని ఆందోళన వ్యక్తంచేశారు. ఇవి సహజ మరణాలు కావని, ప్రభుత్వమే చేస్తున్న చట్టబద్ధమైన హత్యలని ఆరోపించారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామానికి చెందిన పెన్షనర్ కుడుముల కొండయ్య వైద్యం అందక, తన బకాయిలు ఇస్తే బతుకుతానని మీడియా సాక్షిగా వేడుకున్నా ప్రభుత్వం కనికరించకపోవడంతో ఆయన ప్రాణాలు విడిచారని, ఈ ఘటన రేవంత్ సరార్కు మాయని మచ్చ అని మండిపడ్డారు.
పోలీసు అధికారిగా పనిచేసిన బాలకిషన్ తన బిడ్డ పెండ్లికి రావలసిన డబ్బులు అందక, కూతురు ఆత్మహత్యకు పాల్పడితే, ఆ బాధతో తండ్రి గుండెపోటుతో మరణించడం గుండెలను పిండేస్తున్నదని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తంచేశారు. అప్పుల బాధ భరించలేక నల్లగొండలో సత్యనారాయణ వంటి ఉద్యోగులు ఇండ్లు వదిలి పారిపోతుంటే ప్రభుత్వం మొద్దునిద్ర పోతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. జీపీఎఫ్, టీఎస్ఎస్జీఎల్ఐ, జీఐఎస్ వంటివి ప్రభుత్వం ఇచ్చే దానాలు కావని, ఉద్యోగి తన జీతం నుంచి దాచుకున్న సొంత సొమ్ము అని తెలిపారు. ఆ సొమ్మును కూడా ప్రభుత్వం ఈ-కుబేర్‌లో బంధించి 14 వేల మంది పెన్షనర్ల జీవితాలతో చెలగాటం ఆడుతున్నదని మండిపడ్డారు.
తప్పుడు లెకలు పకన పెట్టి, విశ్రాంత ఉద్యోగుల బకాయిలు తక్షణమే ఏకమొత్తంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు నగదు రహిత వైద్యం కోసం హెల్త్‌కార్డులు జారీ చేసి, కార్పొరేట్ దవాఖానల్లో చికిత్స అందేలా చూడాలని కోరారు. పెన్షన్ బకాయిలు అందక చనిపోయిన 36 మంది ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పి, భారీ పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు.