Inflation | న్యూఢిల్లీ, అక్టోబర్ 14: ధరలు ఠారెత్తిస్తున్నాయి. విజృంభిస్తున్న ద్రవ్యోల్బణంతో సామాన్యుడి జీవనం అస్తవ్యస్థమైపోతున్నది. గత నెల అటు రిటైల్, ఇటు టోకు ద్రవ్యోల్బణం రెండూ పెరిగాయి మరి. సెప్టెంబర్లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత చిల్లర ద్రవ్యోల్బణం 9 నెలల గరిష్ఠాన్ని తాకుతూ 5.49 శాతంగా నమోదైంది. గత ఏడాది డిసెంబర్ (5.69 శాతం) తర్వాత ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఇక అంతకుముందు నెల ఆగస్టులో ఇది 3.65 శాతంగానే ఉన్నది. కానీ నెల రోజుల్లో దాదాపు 2 శాతం ఎగిసింది. నిరుడు సెప్టెంబర్లో 5.02 శాతంగా ఉన్నది. ఈ మేరకు సోమవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గణాంకాలు చెప్తున్నాయి.
హోల్సేల్ రేట్లూ పైపైకే..
హోల్సేల్ ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) కూడా పైపైకే వెళ్తున్నది. గత నెల 1.84 శాతంగా నమోదైంది. ఆహారోత్పత్తులు ప్రధానంగా కూరగాయల ప్రభావం దీనిపైనా కనిపించింది. ఆగస్టులో ఇది 1.31 శాతంగానే ఉన్నా.. నిరుడు సెప్టెంబర్లోనైతే మైనస్ 0.07 శాతంగా ఉండటం గమనార్హం. కాగా, దేశంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు కూడా ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమవుతున్నాయని ఎన్ఎస్వో చెప్తున్నది. అలాగే నిరుడు సెప్టెంబర్లో తక్కువగా ఉండటం వల్ల కూడా ఈసారి ఎక్కువైందనుకోవాల్సి వస్తున్నదని అంటున్నది.
వడ్డీరేట్ల కోత ఆశలు గల్లంతే
వచ్చే ద్రవ్యసమీక్షల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీరేట్లను తగ్గిస్తుందనుకుంటే ఈ ద్రవ్యోల్బణం గణాంకాలు ఆ అంచనాలకు గండి కొట్టాయనిపిస్తున్నది. సుదీర్ఘకాలం తర్వాత ఇటీవలి ద్రవ్యసమీక్షలో ఆర్బీఐ తమ పాలసీ వైఖరిని మార్చుకున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లూ హాకిష్ పాలసీ (అధిక వడ్డీరేట్ల విధానం)ని అవలంభించిన సెంట్రల్ బ్యాంక్.. ఇకపై తటస్థ వైఖరి (న్యూట్రల్ పాలసీ)కి మారింది. దీంతో రెపోరేటు తగ్గుతుందన్న సంకేతాలు వచ్చాయి. అయితే ఇప్పుడు రిటైల్తోపాటు హోల్సేల్ ద్రవ్యోల్బణాలు ఎగిసిపడటం ఈ ఆశలపై నీళ్లు చల్లినైట్టెంది. నిరుడు ఏప్రిల్ నుంచి రెపోరేటును 6.5 శాతం వద్దే ఆర్బీఐ కొనసాగిస్తున్నది. దీంతో వ్యక్తిగత, గృహ, వాహన తదితర రుణాలపై వడ్డీరేట్లు ఎక్కువగానే ఉంటున్నాయి. ఇది ఆయా రంగాల అమ్మకాలనూ ప్రభావితం చేస్తుండగా, దేశ ఆర్థిక వృద్ధినీ దెబ్బతీస్తున్నది. దీంతో వడ్డీరేట్లను తగ్గించాలన్న డిమాండ్లు వ్యాపార, పారిశ్రామిక వర్గాల నుంచి ఎక్కువైపోయాయి. మరి డిసెంబర్ ద్రవ్యసమీక్షలో ఆర్బీఐ నిర్ణయం ఎలా? ఉంటుందో చూడాలి.
కూరగాయల దెబ్బ
రిటైల్ ద్రవ్యోల్బణం ఇంతలా పెరిగిపోవడానికి కారణం ఎంతకీ దిగిరాని ఆహారోత్పత్తుల ధరలే. ముఖ్యంగా కూరగాయల రేట్లు తారా స్థాయిలోనే కదలాడుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) వివరాల ప్రకారం ఆహార ద్రవ్యోల్బణం ఈ సెప్టెంబర్లో 9.24 శాతానికి ఎగిసింది. ఆగస్టులో 5.66 శాతమే. నిరుడు సెప్టెంబర్లోనూ 6.62 శాతంగానే ఉన్నది. కానీ ఈ దఫా భారీగా పెరిగిపోయింది. బహిరంగ మార్కెట్లో కిలో కూరగాయలు రకాన్నిబట్టి రూ.60 నుంచి 110 పలుకుతున్నాయి. టమాట రూ.100కు సమీపంలో కదలాడుతున్న సంగతి విదితమే. ఇక పప్పుధాన్యాల ధరలూ ఎక్కువగానే ఉన్నాయి. కిలో రూ.100-150 పెట్టి కొన్సాలి వస్తున్నది. వంటనూనెల రేట్లూ కిలోకు రూ.20-40 మేర పెరిగిపోయాయి.