హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ కలలను నెరవేర్చే విధంగా పనిచేయాలని, వచ్చిన అవకాశాన్ని సేవ కోసం వినియోగించాలని గొర్రెల, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన దూదిమెట్ల బాలరాజ్యాదవ్కు పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సూచించారు. గురువారం మాసబ్‌ట్యాంక్‌లోని కార్యాలయంలో బాలరాజ్యాదవ్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి తలసాని మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకంలో రాష్ట్రంలోని గొల్ల కురుమలు ఆర్థికంగా బలోపేతమయ్యారని తెలిపారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా, పథకాన్ని పక్కాగా అమలుచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. చైర్మన్ బాలరాజ్యాదవ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, గొల్ల కురుమల అభివృద్ధి కోసం కృషిచేస్తానని తెలిపారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, జైపాల్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.