హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): అక్షరమంటే తెలియని ఆదివాసీ కుటుంబాలవి.. తరతరాలుగా పేదరికంలోనే మగ్గిన బతుకులు అవి.. నాడు వాళ్ల బిడ్డలకు చదువు చెప్పినవాళ్లు లేరు, చదువుకున్నవాళ్లు లేరు. తెలంగాణ ప్రభుత్వం అండతో గురుకులాల్లో చేరి చదువుకున్నారు. దేశంలోనే ప్రముఖ విద్యాసంస్థల్లో సీటు సాధించారు.. ట్రైబల్ ప్రాంతాల్లోని కొలవార్ తెగ గిరిపుత్రులు. కానీ, ఫీజులు కట్టుకొనే స్థోమత లేక దాతల కోసం ఎదురుచూస్తున్నారు. ఉన్నత చదువులు చదివి, తమలాంటి పేదవాళ్లను ఆదుకోవాలనుకొంటున్నామని.. అందుకోసం తమ భవిష్యత్తుకు ఆర్థిక అండ కల్పించాలని వేడుకొంటున్నారు.
5 నుంచి 10వ తరగతి వరకు సిర్పూర్లో ఆశ్రమ పాఠశాలలో చదివాను. హయత్‌నగర్‌లోని తెలంగాణ ట్రైబల్ గురుకులంలో ఇంటర్ చేశాను. పాండిచ్చేరి ఇంజినీరింగ్ కాలేజీలో ఈసీఈలో సీటు వచ్చింది. ఏటా రూ.లక్షా20 వేలు కట్టాలి. అంతమొత్తం కట్టే స్థోమత నాకు లేదు. నా తల్లిదండ్రులు కూలీలు. వాళ్ల కష్టమంతా తిండికే సరిపోతుంది.
టేకం అంజన్న, ఫోన్ నంబర్ 8074168273
దరోగపల్లి చెడ్వాయి, పెంచికల్పేట్ మండలం, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా
కాగజ్‌నగర్ ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి వరకు, హయత్‌నగర్‌లోని తెలంగాణ ట్రైబల్ గురుకులంలో ఇంటర్ చదివాను. ఐఐసీటీ బదోహి (యూపీ)లో సీటొచ్చింది. మొదటి ఏడాదే రూ.90 వేలు కట్టాలన్నారు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. చార్జీలకు డబ్బు కూడబెట్టుకున్న. కానీ, జాయిన్ కావటానికి డబ్బు లేదు.
టేకం నాగరాజు, ఫోన్ నంబర్ 8688953318
ముత్తంపేట్, కౌటాల మండలం, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా
బజార్ హత్నూర్లోని ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి, హయత్‌నగర్‌లోని సీవోఈ గురుకులంలో ఇంటర్ చేశా. ఇంజినీర్ కావాలన్నది చిన్నప్పటి నుంచి నా కల. తమిళనాడులోని తంజావూరులో ఫుడ్ టెక్నాలజీ సంస్థలో సీటు వచ్చింది. ఫీజు ఎట్లా కట్టాలో అర్థమైతలేదు.
కుమ్రం విశ్వనాథ్, ఫోన్ నంబర్ 9177232960
కొలాంగూడ భూతై, బజార్ హత్నూర్ మండలం, ఆదిలాబాద్ జిల్లా
హయత్‌నగర్‌లోని సీవోఈలో ఇంటర్ చదివా. సివిల్స్ నా కల. ఐఐఐటీ హిమాచల్‌ప్రదేశ్‌లో సీటు వచ్చింది. ఒక్కో సెమిస్టర్‌కే రూ.లక్షా33వేల ఫీజు. అంత కట్టలేని పరిస్థితి.
పూజారి మహేందర్, ఫోన్ నంబర్ 9398873624
ధనురేటి/కలౌడి, కౌటాల మండలం, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా
పదో తరగతి వరకు చేడ్వాయి పాఠశాలలో, హయత్‌నగర్‌లోని గురుకుల కాలేజీలో ఇంటర్ చదివాను. నా తల్లిదండ్రులు కూలీలు. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ-సోనేపట్ (హర్యానా)లో సీటు వచ్చింది. మొదటి ఏడాదే రూ.80 వేలు చెల్లించాలి, కానీ మావద్ద అంత డబ్బు లేదు.
మండిగ సాయికుమార్, ఫోన్ నంబర్ 9866425703, గుంట్లపేట, పెంచికల్పేట్ మండలం, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా
మేము చెంచులం. మన్ననూరు ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో పదోతరగతి, హయత్‌నగర్‌లోని గురుకులంలో ఇంటర్ చదివా. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీలో సీటు వచ్చింది. నా తల్లిదండ్రులు ఇటుకపనికి వెళ్తారు. దాతలు ఆదుకొంటే మంచిగా చదివి ఐఏఎస్ సాధిస్తా. ప్రతి సెమిస్టర్‌కు రూ.80 వేల ఖర్చవుతుందని అన్నారు. అంత చెల్లించలేని పరిస్థితి.
నల్లపోతుల అనిల్,ఫోన్ నంబర్ 9849585308, సీబీతాండ, ఉప్పునుంతల మండలం, నాగర్ కర్నూల్ జిల్లా