ఇల్లెందు, మే 13 : సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు ఏజెన్సీ ప్రాంతాలకు తొలి ప్రాధాన్యతలో ఇవ్వాలని, ఈ మేరకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతూ న్యూ డెమోక్రసీ నాయకులు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు కలిసి వినతి పత్రం అందజేశారు. అలాగే కోమరారం, బోడు లను మండలాలుగా ప్రకటించాలని, ఇల్లందును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని విన్నవించారు.
మంగళవారం టేకులపల్లి మండలం కోయగూడెంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య స్వగృహంలో డిప్యూటీ సీఎంను సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఆవునూరి మధు, ఇల్లందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు కలిసి వినతి పత్రం అందించారు. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలకు సీతారామ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలను రోళ్లపాడు రిజర్వాయర్ ద్వారా అందించాలన్నారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం హామీ ఇచ్చినట్లుగా వారు తెలిపారు.