మనుషుల చర్మం ఒలిచి వ్యాపారం చేసే భయంకరమైన ముఠాతో ఓ యువతి చేసే పోరాటం నేపథ్యంలో ‘మై నేమ్ ఈజ్ శృతి’ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. భారతీయ తెరపై ఇలాంటి వైవిధ్యమైన కథాంశంతో సినిమా రాలేదు’ అని అన్నారు శ్రీనివాస్ ఓంకార్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ కథానాయిక హన్సిక టైటిల్ రోల్‌ని పోషిస్తున్నది. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మిస్తున్నారు. ‘మనుషుల చర్మంతో వ్యాపారం చేస్తామంటున్నారు. వాళ్లను ఏం చేయాలి? అంటూ హన్సిక ప్రశ్నించే సంభాషణతో ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. మంగళవారం ఈ చిత్రంలోని ‘రెప్పే వేసేలోగా మారిందేమో నా రాత..తప్పే చేసే లాగా ముప్పే వచ్చే నా వెంట’ అంటూ సాగే టైటిల్ లిరికల్ వీడియోను విడుదల చేశారు.
కె.కె.సాహిత్యాన్నందించిన ఈ గీతానికి మార్క్ రాబిన్ సంగీతాన్నందించారు. హారిక నారాయణ ఆలపించారు. కథానాయిక హన్సిక మాట్లాడుతూ ‘ఇలాంటి భావోద్వేగభరితమైన కథలో ఎప్పుడూ నటించలేదు. కథాగమనంలోని మలుపులు ఉత్కంఠను పంచుతాయి. వినూత్నమైన కాన్సెప్ట్‌తో ఆకట్టుకుంటుంది’ అని చెప్పింది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ‘అనుక్షణం ఉత్కంఠగా సాగే చిత్రమిది. ఎవరూ ఊహించని మలుపులతో సాగుతుంది’ అన్నారు. మురళీశర్మ, ఆడుకలం నారాయణ్, జయప్రకాష్, ప్రవీణ్, సీవీఎల్ నరసింహారావు, కేదారి శంకర్, పూజా రామచంద్రన్ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి కెమెరా: కిషోర్ బోయిడపు, సంగీతం: మార్క్ రాబిన్, ఎడిటర్: చోటా కె ప్రసాద్, స్టంట్స్: రాబిన్ సుబ్బు, సాహిత్యం: కృష్ణకాంత్, ఆర్ట్: గోవింద్ ఎరసాని, లైన్ ప్రొడ్యూసర్: విజయ్‌కుమార్ కర్రెం, సహనిర్మాత: పవన్‌కుమార్ బండి, నిర్మాత: బురుగు రమ్య ప్రభాకర్, రచన-దర్శకత్వం: శ్రీనివాస్ ఓంకార్.