న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిన కల్తీ నెయ్యి వాడినట్టు వచ్చిన ఆరోపణలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ సర్కారును కేంద్ర మంత్రి నడ్డా కోరారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుతో తాను మాట్లాడానని, వారి వద్ద ఉన్న సమాచారాన్ని పంపాలని కోరానన్నారు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు, ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు అవసరమని, దోషులకు తగిన శిక్ష పడాల్సిందేనని కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. కల్తీ నెయ్యి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ డిమాండ్ చేశారు. ఇది కేవలం కుంభకోణమే కాదని, హిందూయిజం నాశనానికి జరిపిన కుట్రగా ఆయన అభివర్ణించారు.
క్షమించరాని నేరం : అయోధ్య ఆలయ ప్రధాన అర్చకులు
తిరుమల నెయ్యి కల్తీపై అయోధ్య ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒక వేళ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవడం నిజమైతే అది క్షమించరాని నేరం. దానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. ‘వైష్ణవులు, కొందరు భక్తులు కనీసం వెల్లుల్లి, ఉల్లిపాయ కూడా ముట్టరు. అలాంటి పరిస్థితుల్లో నెయ్యిలో కొవ్వు కలిపారనడం నిజంగా దురదృష్టకరం. ఇది హిందువుల విశ్వాసాలను ఎగతాళి చేయడమే’ అని అన్నారు.
సుప్రీంకోర్టులో పిటిషన్
తిరుమల కల్తీ నెయ్యి వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. తిరుమల లడ్డూ కల్తీతో హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకుని హిందువుల మతపరమైన హక్కులను కాపాడాలని సత్యం సింగ్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.