Hire Vehicles | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో సేవలందిస్తున్న అద్దె వాహనాల బకాయిలు (Pending Bills) చెల్లించకుంటే జూలై 15 నుంచి ఆ వాహనాలను బంద్ చేస్తామని తెలంగాణ హైర్ వెహికల్స్ అసోసియేషన్ హెచ్చరించింది. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జీ నర్సింగ్ యాదవ్, గౌరవ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో సోమవారం ముఖ్యమంత్రికి రాసిన వినతిపత్రంలో విన్నవించారు.
18 నెలలుగా నిలిచి బిల్లు
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో అధికారిక పనులు, క్షేత్రస్థాయి పరిశీలన కోసం 5000కు పైగా అద్దె వాహనాలు పనిచేస్తున్నాయి. వీటికి సంబంధించిన బిల్లులు 18 నెలలుగా అందించడం లేదని, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్‌లో ఉన్నాయని అసోసియేషన్ నాయకులు వెల్లడించారు. దీంతో బిల్లులు రాకపోవడంతో డీజిల్ ఖర్చులు, డ్రైవర్ల జీతాలు, వాహనాల ఇన్సూరెన్స్, ఈఎంఐలకు వాహన యజమానులు డబ్బులు చెల్లించడానికి ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయని, వాహనాలను జప్తు చేసే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.
55,000కు పెంచాలి
ప్రస్తుతం వాహనాలకు జీహెచ్ఎంసీ పరిధిలో నెలకు రూ. 34,000, జిల్లాల హెడ్‌క్వార్టర్స్‌లో రూ. 33,000 చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. ఇవి 2017లో నిర్ణయించినవి, ప్రస్తుతం డీజిల్ ధరలు, వాహన నిర్వహణ ఖర్చులు పెరిగినందున నెలవారీ అద్దెను రూ. 55,000కు పెంచాలని వారు డిమాండ్ చేశారు.
ప్రభుత్వానికి ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తున్నామని, ఐదు వేల వాహనదారుల కుటుంబాలను ఆదుకోవడానికి సీఎం వెంటనే స్పందించి వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వాలని వారు ఆ వినతిపత్రంలో కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే జూలై 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సేవలను నిలిపివేస్తామని వారు హెచ్చరించారు. ఈ వినతిపత్రం ప్రతులను ఆర్థిక మంత్రి, రవాణా శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రవాణా శాఖ కమిషన్, రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు సమర్పించారు.