హైదరాబాద్, జూన్26 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల రక్షణ పనులను ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ మధ్యంతర నివేదిక మేరకు ఇరిగేషన్‌శాఖ చేయిస్తున్నది. మేడిగడ్డలోని 7వ బ్లాక్‌లో కుంగుబాటుకు గురైన 20వ పిల్లర్ గేట్ మినహా మిగతావన్నీ అధికారులు ఎత్తిపెట్టారు. 7వ బ్లాక్ పొడవునా ఎగువ, దిగువన సీకెంట్ పైల్స్ అమర్చారు. బరాజ్ ఎగువ, దిగువన సీసీ బ్లాక్‌లను పునరుద్ధరించారు. బరాజ్‌ల వద్ద ఇసుకమేటలను కూడా తొలగిస్తున్నారు. నాలుగు రోజుల్లో పనులన్నీ పూర్తవుతాయని అధికారులు వివరించారు. 7వ బ్లాక్ అప్‌స్ట్రీమ్‌లో 20పిల్లర్‌కు ఎదురుగా ఏర్పడ్డ బొయ్యారం ముందుగా 1000 క్యూబిక్ మీటర్ల మేరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. సిమెంట్, ఇసుక మిశ్రమంతో నింపి పూడ్చినట్టు తెలిపారు. బరాజ్ పునాది కింద మట్టి కొట్టుకుపోకుండా ఉండేందుకు కొత్తగా సీకెంట్ పైల్స్ వేసినట్టు వివరించారు. 20వ పిల్లర్ మినహా బరాజ్‌లో మరేచోటా సాంకేతిక లోపాలు లేవని నివేదికలో వెల్లడైనట్టు తెలిపారు. మేడిగడ్డ బరాజ్‌లో ప్రస్తుతానికి నీటిని నిల్వ చేసే పరిస్థితి లేనందున బరాజ్ ఎగువన జియోట్యూబ్ టెక్నాలజీ ద్వారా అడ్డుకట్ట వేసి కన్నెపల్లి పంప్‌హౌస్‌కు నీటిని మళ్లించి లిఫ్ట్ చేయాలని ప్రణాళికలు రూపొందించారు. నీటిని ఎత్తిపోసేందుకు ఎన్డీఎస్ఏ అనుమతులు పొందాలని చూస్తున్నారు.
నేడు అన్నారానికి సీడబ్ల్యూపీఆర్ఎస్
కాళేశ్వరం : అన్నారం బరాజ్‌కు సీడబ్ల్యూపీఆర్ఎస్ బృందం గురువారం రానుంది. బరాజ్ వద్ద 35, 38, 42 గేట్ల వద్ద 25 మీటర్లలోతు వరకు బోర్‌హోల్ వేస్తూ మట్టి నమూనాలు సేకరించి పుణెలోని ల్యాబ్‌కు తరలించి పరీక్షించనున్నారు. వచ్చిన రిపోర్టును బట్టి బరాజ్ వద్ద పనులు చేపట్టనున్నారు.