హైదరాబాద్, సెప్టెంబర్ 2(నమస్తే తెలంగాణ): అమృత్ టెండర్ల విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించేలా తనపై ఆరోపణలు చేశారంటూ వ్యాపారవేత్త సృజన్‌రెడ్డి దాఖలు చేసిన కేసులో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావుకు ఊరట లభించింది. కింది కోర్టులో జరిగే ఆ కేసు విచారణకు కేటీఆర్ వ్యక్తిగతంగా హాజరుకానవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
ఈ మేరకు జస్టిస్ కే లక్ష్మణ్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో సృజన్‌రెడ్డి దాఖలు చేసిన ప్రైవేట్ పిటిషన్‌ను కేటీఆర్ హైకోర్టులో సవాలు చేయడంతో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. కేటీఆర్ పిటిషన్‌పై సృజన్రెడ్డితోపాటు పోలీసుకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేశారు.