Akash Ambani – Reliance | రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ ఆకాశ్ అంబానీ కీలక ప్రకటన చేశారు. గుజరాత్‌లోని జామ్ నగర్ రిఫైనరీని అడ్వాన్స్డ్ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్రంగా రూపుదిద్దుతామని తెలిపారు. ‘రిలయన్స్ కుటుంబ రత్నం’గా పేరొందిన జామ్ నగర్‌ను ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలు గల ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రిలయన్స్ జామ్ నగర్ రిఫైనరీ ఏర్పాటై 25 ఏండ్లు పూర్తయిన సందర్భంగా సోదరి ఈషా అంబానీ, సోదరుడు అనంత్ అంబానీలతో కలిసి జామ్ నగర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును 24 నెలల్లో పూర్తి చేస్తామని ప్రతీన బూనారు. రిలయన్స్ వృద్ధికి సమిష్టి విజన్ ఉందని ప్రకటించారు.
`ఇందుకోసం జామ్‌నగర్‌లో భవన నిర్మాణం కూడా ప్రారంభమైంది. 24 నెలల్లోనే ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. ఈషా అంబానీ, అనంత్ అంబానీలతోపాటు తాను రిలయన్స్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నాం` అని చెప్పారు. రిలయన్స్ వృద్ధికి తాము నిబద్ధతతో కలిసి పని చేస్తున్నామని తెలిపారు. ఎల్లవేళలా జామ్ నగర్ రిలయన్స్ కు రత్నం వంటిదన్నారు. ఇది తమ తల్లిదండ్రులతోపాటు యావత్ రిలయన్స్ కుటుంబం నిబద్ధత అని చెప్పారు. ఐటీ రంగ ప్రపంచంలో జామ్ నగర్‌ను గ్లోబల్ లీడర్‌గా తీర్చి దిద్దుతామని తెలిపారు.
1999 డిసెంబర్ 28న రిలయన్స్ జామ్ నగర్ రిఫైనరీ స్థాపించారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనింగ్ హబ్‌గా ఎదిగింది. ప్రారంభంలో దీని భవిష్యత్ మీద పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. రోడ్లు, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతుల్లేవని అంతర్జాతీయ నిపుణులు పెదవి విరిచారు. కానీ, రిలయన్స్ ఫౌండర్ ధీరూభాయ్ అంబానీ ఆ అనుమానాలను కొట్టిపారేస్తూ కేవలం 33 నెలల్లోనే రిఫైనరీ నిర్మాణం పూర్తి చేశారు.