Adani | న్యూఢిల్లీ, ఆగస్టు 19: దేశీయ కుబేరుల్లో ఒకరైన గౌతమ్ అదానీ మరో విద్యుత్ ప్లాంట్‌ను చేజిక్కించుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు విద్యుత్ యూనిట్లను కైవసం చేసుకున్న ఆయన..తాజాగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్స్ ప్లాంట్‌ను కొనుగోలు చేసేయోచనలో ఉన్నారు. ఒప్పందం విలువ రూ.2,400 కోట్ల నుంచి రూ.3 వేల కోట్ల స్థాయిలో ఉంటుందని అంచనా. రుణాలు చెల్లింపులు విఫలంకావడంతో రిలయన్స్ పవర్‌కు చెందిన 600 మెగావాట్ల బుతిబోరి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రస్తుతం ఎన్సీఎల్టీ వద్ద ఉన్నది. విదర్భ ఇండస్ట్రీస్ పవర్ లిమిటెడ్ పేరుతో నాగపూర్ వద్ద ఉన్న ఈ విద్యుత్ ప్లాంట్ కొనుగోలుకు సంబంధించి సీఎఫ్ఎం అసెట్ రీకన్స్ట్రక్షన్తో అదానీ పవర్ సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రముఖ మీడియా సంస్థ మింట్ ఒక కథనాన్ని ప్రచూరించింది. ఒక్కో మెగావాట్ ధర రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఉంటుందని అంచనా. గతంలో ఈ ప్రాజెక్టు విలువ రూ.6 వేల కోట్ల స్థాయిలో ఉండగా, ప్రస్తుతం ఈ ప్లాంట్ మూతపడటంతో దీని విలువ సగానికి సగం పడిపోయింది.
వెనక్కి తగ్గిన సజ్జన్ జిందాల్
దేశీయ వ్యాపారవేత్త సజ్జన్ జిందాల్ కూడా రిలయన్స్ పవర్‌కు చెందిన ఈ ప్లాంట్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపినప్పటికీ ప్రస్తుతం వెనుకంజవేశారు. కంపెనీ విలువ అత్యధికంగా ఉండటం, నిర్వహణ సమస్యలు అధికంగా ఉండటంతో ఆయన వెనక్కి తగ్గినట్లు తెలుస్తున్నది. దీంతో ఈ యూనిట్ రేసులోకి మళ్లీ అదానీ వచ్చారు. ముంబైలో విద్యుత్‌ను సరఫరా చేయడానికి గతంలో రిలయన్స్ పవర్ ఈ విద్యుత్ ప్లాంట్‌నే వినియోగించేది. ఆ తర్వాతి క్రమంలో ముంబై డిస్ట్రిబ్యూషన్ బిజినెస్‌ను అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ చేతికి వెళ్లడంతో ఈ యూనిట్ నిరూపయోగంగా మారిపోయింది. దేశవ్యాప్తంగా ఒకవైపు విద్యుత్‌కు డిమాండ్ పెరుగుతుండటంతో అదానీ గ్రూపు తన థర్మల్ విద్యుత్ కెపాసిటీని పెంచుకునే పనిలో పడింది. దీంట్లో భాగంగా మూతపడిన, ఎన్సీఎల్టీ కింద ఉన్న విద్యుత్ ప్లాంట్లను చౌకగా కొనుగోలు చేయడానికి ప్రయత్నాలను వేగవంతం చేసింది.