న్యూఢిల్లీ : పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ వంట గ్యాస్ లభ్యతపై కేంద్రం కీలక చర్యలు చేపట్టింది. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీలను ఆదేశించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరో రెండు వారాలు కొనసాగితే బ్యారెల్ ముడి చమురు ధర 150 డాలర్లకు పెరిగి ఆర్థిక సంక్షోభం తలెత్తవచ్చని ఖతార్ పెట్రోలియం మంత్రి సాద్ ఆల్ కాబీ హెచ్చరించారు.
మరోవైపు, పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలు, ఆస్తులపై మాత్రమే తాము దాడులు చేస్తున్నామని ఇరాన్ విదేశాంగ సహాయ మంత్రి సయ్యద్ ఖతీబ్జాదే తెలిపారు. తమ దాడులతో అరబ్ దేశాల్లో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఉద్రిక్తతల వేళ తమ పౌరులకు దుబాయ్‌లోని అధికారులు మొబైల్ అలర్ట్ మెసేజీలు పంపించారు. ఇండ్ల నుంచి బయటకు రావొద్దని, అత్యవసర సమయాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు.