రామచంద్రాపురం, నవంబర్ 9 : సైక్లింగ్‌తో ఆరోగ్యవంతమైన జీవితం సొంతమని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో ఆదివారం ‘సైక్లోతాన్ 2025’ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ రాష్ర్టాల నుంచి 1900 మంది సైక్లిస్టులు పాల్గొన్నారు. సైక్లోతాన్ పోటీలకు గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైక్లోతాన్ వంటి ఈవెంట్లు ఫిట్నెస్, కమ్యూనిటీ వెల్‌బీయింగ్‌పై పెరుగుతున్న అవగాహనకు నిదర్శనమని అన్నారు. ప్రతి ఒక్కరూ జీవితంలో సైక్లింగ్‌ను భాగం చేసుకుని ఆరోగ్యకర సమాజం వైపు అడుగులు వేయాలని సూచించారు. హెచ్‌సీఎల్ గ్రూప్ ప్రెసిడెంట్ సుందర్ మహాలింగం పాల్గొన్నారు.