బేగంపేట్: విద్యార్థులు కృషి, పట్టుదలతో లక్ష్యాలను అందుకోవాలని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. మంగళవారం ఏకలవ్య ఎడ్యుటెక్ సంస్థను ఎంపీ రంజిత్‌రెడ్డితో కలిసి గోపీచంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘జీవిత పాఠాలు విజయ తీరాలకు చేర్చుతాయి. తరగతి గదిలో చెప్పే పాఠ్యాంశాల కంటే జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను, సమస్యలను ఎదుర్కొగలిగే నేర్పరితనం, నైపుణ్య శిక్షణ అవసరం. ఇటువంటి కోర్సులను తొలిసారి ప్రవేశపెడుతున్న ఏకలవ్య ఎడ్యుకేట్ సంస్థ ప్రయత్నం అభినందనీయం’ అని అన్నారు. ఏకలవ్య సంస్థ వ్యవస్థాపకులు అనిల్‌కుమార్ స్పందిస్తూ తమ సంస్థ ద్వారా తొలుత 12 కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంతోష్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, సునీల్‌రెడ్డి, నాగేశ్ తదితరులు పాల్గొన్నారు.