
హైదరాబాద్, డిసెంబర్ 8: శరవేగంగా వృద్ధిచెందుతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఈ సంవత్సరం ఇప్పటివరకూ రెండు మెగా భూ లావాదేవీలు జరిగాయి. రెసిడెన్షియల్ ప్రాజెక్టుల్ని అభివృద్ధిపర్చడానికి రెండు రియల్టీ కంపెనీలు 78 ఎకరాల కొనుగోలుకు రూ.1,050 కోట్లు పెట్టుబడి చేసాయని కన్సల్టెన్సీ సంస్థ అనారాక్ వైస్ చైర్మన్ సంతోష్‌కుమార్ తెలిపారు. 2021 ఫిబ్రవరిలో నార్సింగ్‌లో 25 ఎకరాల భూమిని రూ.800 కోట్లకు రాజపుష్పా ప్రాపర్టీస్ కొనుగోలుచేయగా, ఏప్రిల్‌లో హైదరాబాదీ కంపెనీ ఐఆర్ఏ రియల్టీ టెక్ శంషాబాద్‌లో 53 ఎకరాలు రూ.250 కోట్లకు కొన్నది.
ఏడు నగరాల్లో 1,205 ఎకరాలు
2020 మూడో త్రైమాసికం నుంచి 2021 నవంబర్ వరకూ హైదరాబాద్‌తో సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 28 వేరువేరు లావాదేవీల్లో 1,205 ఎకరాల క్రయవిక్రయాలు జరిగినట్లు సంతోష్‌కుమార్ చెప్పారు. కొవిడ్-19కు (2020 మార్చి) ముందు 7-8 నెలల్లో రియల్ ఎస్టేట్ పరిశ్రమలో భూ లావాదేవీలు పరిమితంగా జరిగాయన్నారు. 2020 జూలై-సెప్టెంబర్ త్రైమాసికం నుంచి రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పునర్ప్రారంభమయ్యాయని, కొన్ని ప్రధానమైన డీల్స్ గత ఏడాదికాలంగా జరిగాయన్నారు.