Mamata Banerjee | కోల్‌కతా, సెప్టెంబర్ 12: బెంగాల్లో ప్రభుత్వం, జూనియర్ డాక్టర్ల మధ్య ప్రతిష్ఠంభనకు గురువారం కూడా తెరపడలేదు. చర్చల నిమిత్తం జూనియర్ వైద్యులు పెట్టిన డిమాండ్లను బెంగాల్ ప్రభుత్వం నిర్దంద్వంగా తిరస్కరించడంతో వైద్యులు చర్చా వేదికకు రావడానికి తిరస్కరించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన సీఎం మమతా బెనర్జీ ప్రజల కోసం తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రకటించారు. డాక్టర్లతో చర్చల కోసం రెండు గంటల పది నిముషాల పాటు వేచి చూసిన ఆమె.. తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘నేను పదవిని లెక్క చేయను. ప్రజల కోసం రాజీనామా చేయడానికి సిద్ధం. అయితే జూనియర్ వైద్యుల సమ్మె కారణంగా నెల రోజులుగా స్తంభించిన వైద్య సేవల పునరుద్ధరణ జరిగి సాధారణ పరిస్థితులు నెలకొనాలని కోరుకుంటున్నాను’ అని ఆమె పేర్కొన్నారు. ‘కోర్టు పరిధిలో ఉన్న అంశాలు బహిరంగ పరచడం చట్ట విరుద్ధం. అందుకే చర్చలను లైవ్ టెలికాస్ట్ చేయాలంటూ వారు పెట్టిన డిమాండ్‌ను తిరస్కరించా. అయితే చర్చలను రికార్డు చేయడానికి మూడు కెమెరాలు ఏర్పాటు చేశా’ అని మమత తెలిపారు. ‘సమస్యను పరిష్కరించడానికి నేను చేయాల్సిన ప్రయత్నమంతా చేశా. బాధితురాలికి న్యాయం జరగాలని కోరుకుంటున్నా. అయితే వైద్యులను చర్చలకు రప్పించడంలో విఫలమైనందుకు, ఇన్ని రోజులుగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు క్షమాపణ చెబుతున్నా. చర్చలకు వెళ్లవద్దంటూ జూనియర్ డాక్టర్లకు కొంతమంది వ్యక్తుల నుంచి ఆదేశాలు వస్తున్నాయి.’ అని ఆమె అన్నారు.
సీఎం వ్యాఖ్యలను జూనియర్ వైద్యులు ఖండించారు. ఆమె తన పదవి రాజీనామా గురించి ప్రస్తావించడం తీవ్ర అసంతృప్తికి గురి చేసిందని, రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో ఇక్కడకు రాలేదని అన్నారు. ఇప్పటికీ చర్చల ద్వారానే తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఎక్కడ చర్చలు నిర్వహించినా రావడానికి తాము సిద్ధమేనని స్పష్టం చేశారు.