Matt Race : ఎప్పుడూ పనిలో నిమగ్నమై, తీవ్రమైన అలసటతో ఉండే జపాన్ (Japan) లో ఓ వినూత్న పోటీ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. గాఢంగా నిద్రపోవడమే ఈ పోటీలోని టాస్క్. గెలిచిన వారికి ఏకంగా రెండు మిలియన్ యెన్ల (Two Million Yen) కు పైగా (భారత కరెన్సీలో సుమారు రూ.12 లక్షలు) బహుమతిగా అందిస్తారు. టోక్యో (Tokyo) లో ‘మ్యాట్ రేస్ (Matt Race)’ పేరుతో ఓ పరుపుల తయారీ కంపెనీ ఈ వింత పోటీ నిర్వహించింది.
నిన్న జరిగిన ఈ పోటీలో తమను తాము ‘కాంపిటేటివ్ స్లీపర్స్’ అని పిలుచుకునే డజన్ల మంది పాల్గొన్నారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఓ గదిలో తక్కువ కాంతిలో, సౌకర్యవంతమైన పరుపులపై వీరంతా 90 నిమిషాలపాటు నిద్రపోయారు. ప్రతి ఒక్కరి తలకు స్లీప్ ట్రాకింగ్ పరికరాలను అమర్చారు. ఎవరు ఎంత వేగంగా నిద్రలోకి జారుకున్నారు..? ఎంత గాఢంగా నిద్రపోయారు..? అనే అంశాల ఆధారంగా విజేతను ఎంపిక చేశారు.
ఈ పోటీలో పాల్గొన్న కొందరు తమ పక్కన ఇష్టమైన టెడ్డీబేర్లను పెట్టుకుని నిద్రపోవడం కనిపించింది. జపాన్ ప్రజలు తీవ్రమైన నిద్రలేమితో బాధపడుతున్నారని, వారిలో నిద్రపై అవగాహన పెంచేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని నిర్వాహక సంస్థ ‘కోలా స్లీప్ జపాన్’ క్రియేటివ్ డైరెక్టర్ రిచిరో నకమా తెలిపారు. జపాన్ ప్రజలు చాలా కష్టపడి పనిచేస్తారని, నిద్రను ఇలా ఒక పోటీగా మార్చడం ద్వారా అందరూ కలిసి నిద్రపోవడం, దానిపై ఆసక్తి పెంచుకోవడం సాధ్యమవుతుందని ఆయన వివరించారు.
ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (OECD) 2021 డేటా ప్రకారం.. జపనీయులు రోజుకు సగటున 7 గంటల 24 నిమిషాలు మాత్రమే నిద్రపోతున్నారని, ఇది ఓఈసీడీ దేశాల్లో అత్యంత తక్కువని తేలింది. ఎక్కువ పని గంటలు, సుదూర ప్రయాణాలు దీనికి కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. ఈ పోటీలో పాల్గొన్న 32 ఏళ్ల చిసాటో హోండా మాట్లాడుతూ.. సమయం ఇట్టే గడిచిపోయింది. ఇంకాస్త ఎక్కువసేపు నిద్రపోతే బాగుండేదనిపించిందని, ఇది చాలా సంతోషకరమైన పోటీ అని తన అనుభవాన్ని పంచుకున్నారు.
ఈ నిద్ర పోటీలో ‘సుయిమీ’ అనే మహిళ విజేతగా నిలిచారు. బహుమతిగా వచ్చిన డబ్బుతో తాను వేరుగా ఇల్లు తీసుకుంటానని చెప్పారు. యువరాణి బెడ్ లాంటిది కొనుక్కుంటానని ఆనందంగా తెలిపారు.