Gujarat : గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రైలర్ ట్రక్కును ఒక ఎస్యూవీ కారు ఢీకొనడంతో ఏడుగురు మరణించారు. ఈ ఘటన మంగళవారం ఉదయం 10.00 గంటల సమయంలో గుజరాత్, భావనగర్-సోమనాథ్ నేషనల్ హైవే సమీపంలో, తలజా తాలూకా, త్రపాజ్ గ్రామం వద్ద జరిగింది. బాధితులు ఒక బొలెరో కారులో భావనగర్ నుంచి అలాంగ్ వెళ్తుండగా, సర్వీస్ రోడ్డుపై ఆగి ఉన్న ఒక ట్రైలర్ ట్రక్కును ఢీకొంది.
ఈ ఘటనలో కారులోని ఏడుగురు మరణించారు. ఆరుగురు ఘటనా స్థలంలోనే మరణించగా, మరొకరు ఆస్పత్రికి తీసుకెల్లగా ప్రాణాలు కోల్పోయారు. వీరంతా స్థానిక షిప్పుయార్డులో పని చేస్తున్నవారిగా గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీం వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. అంబులెన్సుల్ని మోహరించారు. ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. బొలెరో వాహనం వేగంగా ట్రక్కును ఢీకొంది. దీంతో వాహనం తీవ్రంగా దెబ్బతింది. బాధితుల్ని బయటకు తీయడానికి పోలీసులు చాలా శ్రమించాల్సి వచ్చింది.
డోర్లు తెరవడానికి రాడ్లు వంటివి ఉపయోగించాల్సి వచ్చింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. బాధితుల మృతదేహాల్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వాహనం ఢీకొనడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారని జిల్లా ఎస్పీ నితేష్ పాండే తెలిపారు.