Ravi Teja | మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతూ ముందుకు సాగుతున్న రవితేజ.. ప్రస్తుతం రెండు, మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల ‘ఇరుముడి’తో మరోసారి తన స్టైల్లో ప్రేక్షకులను అలరించిన ఆయన.. ఇప్పుడు కొత్త ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు. ఇందులో దర్శకుడు వివేక్ ఆత్రేయతో చేయబోయే సినిమా ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘తులాభారం’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపొందనున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కథానాయికలు, కీలక పాత్రల విషయంలో ఆసక్తికరమైన వార్తలు బయటకు వస్తున్నాయి. రవితేజ సరసన కథానాయికగా నటి ప్రియాంక మోహన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక మోహన్.. రవితేజతో జోడీ కట్టనుండటం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు మలయాళ యువ నటి అనస్వర రాజన్ కూడా ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. కథలో ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. ఇటీవలే ప్రియాంక మోహన్, అనస్వర రాజన్ ఇద్దరికీ సంబంధించిన ఫోటోషూట్ కూడా నిర్వహించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ సినిమాలో అసలు ఆసక్తిని పెంచుతున్న అంశం మాత్రం ప్రతినాయకుడి పాత్ర. రవితేజకు ధీటుగా సాగే నెగెటివ్ షేడ్స్ ఉన్న పవర్ఫుల్ పాత్ర కోసం ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి పేరును చిత్రబృందం పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జేడీ చక్రవర్తి గతంలో ‘జోష్’ సినిమాలో పవర్ఫుల్ విలన్‌గా కనిపించి మెప్పించారు. ఆ తర్వాత కూడా విభిన్నమైన పాత్రలు చేస్తూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు ‘తులాభారం’లో హీరో పాత్రకు సమానంగా ప్రాధాన్యత ఉండే ప్రతినాయకుడి పాత్రను ఆయనతో చేయించాలని దర్శకుడు వివేక్ ఆత్రేయ భావిస్తున్నట్లు టాక్. వివేక్ ఆత్రేయ సినిమాల్లో కథ, పాత్రల రూపకల్పనకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ‘తులాభారం’లో కూడా హీరో, విలన్ పాత్రలు బలంగా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. రవితేజకు పోటీగా జేడీ చక్రవర్తి కనిపిస్తే.. వీరిద్దరి మధ్య సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారే అవకాశం ఉంది.ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సినిమా టైటిల్, నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.