ముంబై, మార్చి 15: ప్రైవేట్ రంగ బ్యాం కుల్లో ఒకటైన ఇండస్ఇండ్ బ్యాంక్ లెక్కల్లో వచ్చిన రూ.2,100 కోట్ల తేడాపై రిజర్వు బ్యాంక్ దృష్టి సారించింది. బ్యాంక్ ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉన్నదని మార్కెట్లో గుప్పుమన్న వార్తలపై సెంట్రల్ బ్యాంక్ స్పందించింది. బ్యాంక్ ఆర్థిక పరిస్థితికి వచ్చిన ఢోకా ఏమీ లేదని, డిపాజిటర్లు, ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చింది. ప్రస్తుతం బ్యాంక్‌లో నెలకొన్న పరిస్థితులను సమీక్షించడానికి, అకౌంటింగ్ తప్పిదాలపై వాస్తవ పరిస్థితులను త్వరగా అంచనావేయడానికి ఇప్పటికే బ్యాంక్ ప్రత్యేకంగా ఆడిట్ బృందాన్ని నియమించినట్లు ఆర్బీఐ పేర్కొంది. ఈ ప్రత్యేక ఆడిట్ బృందం ఈ నెల చివర్లో లేదా వచ్చే నెల తొలివారంలో తన నివేదికను సమర్పించనున్నదని పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా బ్యాంక్‌పై చర్యలు తీసుకుంటామని పేర్కొం ది. ప్రస్తుతం ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బ్యాంక్ ఆర్థిక మూలాలు దృడంగా ఉన్నాయని, క్యాపిటల్ అడక్వసీ రేషియో 16.46 శాతంగాను, ప్రొవిజన్ కవరేజ్ రేషియో 70.20 శాతంగా ఉన్నదని పేర్కొంది.
రంగంలోకి ఐసీఏఐ
ఇండస్ఇండ్ బ్యాంక్ ఖాతాల్లో నెలకొన్న అవకతవకలపై నిగ్గు తేల్చడానికి చార్టర్డ్ అకౌంటెంట్ సంఘం ఐసీఏఐ రంగంలోకి దిగింది. రూ.2,100 కోట్ల వరకు లెక్కల్లో వ్యత్యాసంపై ఐసీఏఐ ప్రత్యేక దృష్టి సారించింది. బ్యాంక్ ఆర్థిక రిపోర్టింగ్ బోర్డ్ ఇచ్చిన సమీక్షపై ఐసీఏఐ ప్రత్యేకంగా సమీక్షించి త్వరలో రిజర్వుబ్యాంక్‌కు తన నివేదికను సమర్పించనున్నది. బ్యాంక్‌లో అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఆడిటింగ్, కంపెనీల చట్టం-2013 ప్రకారం షెడ్యూల్ 2, 3 పై కూడా ప్రత్యేకంగా చర్చించనున్నది. మరోవైపు, గడిచిన ఫారెక్స్ లావాదేవీలకు సంబంధించి హెడ్జింగ్ ఖర్చుల్ని బ్యాంక్ తక్కువగా అంచనా వేసినట్టు ఓ అంతర్గత సమీక్షలో తేలింది. బ్యాంకులో పాలనాపరమైన లోపాలున్నాయన్న దానిపై కూడా ఐసీఏఐ దృష్టి సారించనున్నది. గత వారం బ్యాంక్ సీఈవో, ఎండీ కత్పాలియా పదవీకాలాన్ని మూడేండ్లకు పెంచుతూ ఇండస్ఇండ్ బ్యాంక్ బోర్డు ప్రతిపాదించినా, ఆర్బీఐ మాత్రం ఏడాదికే అనుమతిచ్చింది.