తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో (Karthika Brahmotsavam) శుక్రవారం రథోత్సవం(Rathotsavam) కన్నులపండువగా జరిగింది. రథోత్సవం ఆలయ నాలుగు మాడ వీధుల్లో కొనసాగగా భక్తులు పెద్ద సంఖ్యలో రథాన్ని లాగారు. రథోత్సవం అనంతరం మధ్యాహ్నం రథమండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారిని విశేషంగా అలంకారించారు.
రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అశ్వవాహనంపై అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. రథోత్సవంలో తిరుమల పెద్ద జీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈవో ఎవి ధర్మా రెడ్డి, జేఈవో వీర బ్రహ్మం, సీఈ నాగేశ్వరరావు, ఎస్ ఈ-3 సత్యనారాయణ ,ఈఈలు మనోహర్, నరసింహ మూర్తి , వీఎస్వో బాలి రెడ్డి,ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.