తిమ్మాపూర్, మే22 : ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం కారణంగా రైతులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆవేదన వ్యక్తంచేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మక్తపల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి ఇబ్బందులు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయాలు బంజేసి వడ్లు కొనాలని హితవు పలికారు.
ఫోటోలకు ఫోజులిచ్చే ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు కనీసం రైతులను పరామర్శించి ధైర్యం చెప్పే వీలులేకుండా పోయిందని విమర్శించారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసినప్పటి నుంచి మిల్లుకు తరలించేదాకా రైతులను పీడిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే కవ్వంపల్లికి కమీషన్లు చాలకపోతే మా కిడ్నీలు అమ్ముకోవాలని, కానీ రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని సూచించారు. కవ్వంపల్లికి చెందిన క్వారీలను రెండు, మూడు రోజులు బంద్ చేసి ధాన్యాన్ని తరలించేందుకు లారీలను అప్పగించాలని సూచించారు. రెండు, మూడు రోజుల్లో ధాన్యం కొనకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కరీంనగర్ కార్పొరేషన్, మే 22 : కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను దోపిడీ చేస్తున్నారని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. ఎన్నడూ లేనివిధంగా నాణ్యమైన ధాన్యాన్ని సైతం బీ గ్రేడ్ కింద చూపి క్వింటాల్‌కు దాదాపు రూ.20 ఆర్ఆర్ (రేవంత్‌రెడ్డి) టాక్స్ కట్టిస్తున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోలు సమస్యలపై శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్లో కలెక్టర్ చిత్రా మిశ్రాను కలిసి వినతిపత్రం అందజేశారు. కొనుగోలు జాప్యంతో రైతులు పడుతున్న ఇబ్బందులను వివరించారు. అనంతరం మాట్లాడుతూ వడ్లు యాభై రోజుల నుంచి కేంద్రాల్లో ఉన్నా ఇప్పటివరకు 40 శాతం కూడా కొనలేదని మండిపడ్డారు. చివరి గింజ వరకు కొంటామని చెప్పారని, ఇంకెప్పుడు కొనడం పూర్తిచేస్తారని ప్రశ్నించారు.