Virgin birth | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): పురుషుడి తోడు లేకుండానే కొందరు మహిళలు సంతానాన్ని పొందడాన్ని పౌరాణిక చిత్రాల్లో చూసి అబ్బురపడ్డాం. అయితే, త్వరలోనే మనుషుల్లోనూ ఇది సాకారం కాబోతున్నది. ఇంకా వివరంగా చెప్పాలంటే, పురుషుడి తోడు లేకుండానే మహిళలు గర్భాన్ని దాల్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఈ మేరకు తాజా పరిశోధనలను బట్టి అర్థమవుతున్నది.
మగ జీవితో సంభోగం జరుగకుండానే ఆడ జీవి సంతానాన్ని కనే ప్రక్రియను ‘వర్జిన్ బర్త్’ లేదా ‘పార్తెనోజెనెసిస్’గా పిలుస్తారు. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ జూలో ఇటీవల ఓ బల్లి 8 గుడ్లను పొదిగింది. అయితే, మగ బల్లితో సంపర్కం చెందకుండానే ఈ ప్రక్రియ జరిగినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. మగతోడు లేకుండా.. ఏండ్లపాటు ఏకాంతగా ఉన్నప్పుడు ఆడజీవిలోని హార్మోన్లు, జన్యువుల్లో మార్పులు జరుగుతాయి. దీనిపై పరిసరాల ప్రభావం కూడా ఉంటుంది. వీటన్నింటి వల్ల ‘వర్జిన్ బర్త్’ ప్రక్రియ జరిగే అవకాశమున్నదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఏండ్లపాటు ఏకాంతగా ఉన్నప్పుడు హార్మోన్లు, పరిసరాల ప్రభావం, జన్యువుల్లో మార్పుల వల్ల ఇప్పుడు బల్లిలో జరిగినట్టే.. మహిళల్లో కూడా భవిష్యత్తులో ‘వర్జిన్ బర్త్’కు ఆస్కారం ఉండొచ్చని ఇంగ్లండ్‌లోని నోటింగమ్ ట్రెంట్ యూనివర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ లూయిస్ జెంటిల్ అభిప్రాయపడ్డారు.
2022లో చైనాలో ‘క్రిస్పర్’ అనే జన్యుమార్పిడి సాంకేతికత సాయంతో మగతోడు లేకుండానే ఓ ఆడ ఎలుకలో సంతానాన్ని వృద్ధి చేశారు. క్షీరదాల్లోనూ ఇది జరిగింది. జన్యు మార్పిడి ద్వారా మగతోడు లేకుండానే మహిళల్లోనూ సంతానాన్ని వృద్ధి చేయవచ్చని, అయితే, దానికి మరికొంత సమయం పట్టొచ్చని డాక్టర్ లూయిస్ జెంటిల్ తెలిపారు.
మగ జీవి తోడులేకుండా జరిగే ‘వర్జిన్ బర్త్’ ప్రక్రియలో ఆడ జీవి నుంచే అన్ని జన్యువులు సంతానానికి వస్తాయి. దీంతో పుట్టే బిడ్డ కచ్చితంగా ఆడబిడ్డే అవుతుంది. ఇది ఇలాగే కొనసాగితే, భూమిమీద మగజాతి అంతర్థానమయ్యే ప్రమాదమున్నదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
‘వర్జిన్ బర్త్స్’ ప్రక్రియ ఇప్పటికే షార్క్స్, కొన్ని రకాల పాములు, మొసళ్లు, కందిరీగలు, తేళ్లలో కొనసాగుతున్నది. తాజాగా బల్లులు, ఎలుకల్లోనూ దీన్ని గుర్తించారు.