హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం భట్టుగూడెంలో 8వ శతాబ్దపు అరుదైన శిల్పాలు లభ్యమయ్యాయి. కామేశ్వరాలయం ముందున్న ఆ శిల్పాలను శుక్రవారం ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో, పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి పరిశీలించా రు. కామేశ్వరస్వామి(శివుని) ద్వారపాలకులుగా బ్రహ్మ, భైరవ శిల్పాలతోపాటు ద్వారశాఖలపై స్త్రీమూర్తులుగా శంఖనిధి, పద్మనిధి శిల్పాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ ప్రతిమల లక్షణాలపై కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్‌ను సం ప్రదించగా.. అవి క్రీ.శ 7-8 శతాబ్దాలకు చెందిన పల్లవ-బాదామీ చాళు క్య శిల్పశైలిని పోలి ఉన్నాయని వెల్లడించారు. వాటి వెనక సుమారు 1200 సంవత్సరాల చరిత్ర ఉందని వివరించారు. బైరవుడు, బ్రహ్మ ద్వా రపాలకులుగా ఉండటం అరుదైన అంశమని హరగోపాల్ చెప్పినట్టు శివనాగిరెడ్డి తెలిపారు. ఈ శిల్పాలపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విగ్రహాలపై ఉన్న రంగులను తొలగించి ఆల య ప్రాంగంణంలోనే పీఠాలపై నిలబెట్టి భద్రపరచాలని గ్రామస్థులకు విజ్ఞప్తి చేశారు.