బాలీవుడ్ సీనియర్ నటుడు అజయ్‌దేవ్‌గణ్, కన్నడ హీరో సుదీప్ మధ్య నెలకొన్న హిందీ జాతీయ భాషా తాలూకు వివాదం సినీ రంగంలో దూమారాన్ని రేపుతున్నది. వీరిద్దరి ట్విట్టర్ యుద్ధం హాట్‌టాపిక్‌గా మారింది. తాజాగా ఈ కాంట్రవర్సీపై అగ్ర దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ స్పందించారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు. దక్షిణాది చిత్రాలు తిరుగులేని వసూళ్లు సాధించడం బాలీవుడ్ తారలకు కంటగింపుగా మారిందని ఆర్జీవీ వ్యాఖ్యానించారు.
‘దక్షిణాది స్టార్స్‌ను చూసి బాలీవుడ్ వాళ్లు జెలసీ ఫీలవుతున్నారు. ఇది కాదనలేని సత్యం. ‘కేజీఎఫ్-2’ తొలిరోజు హిందీలో యాభైకోట్ల వసూళ్లు సాధించింది. మున్ముందు బాలీవుడ్ ఓపెనింగ్ కలెక్షన్స్ ఏ తీరున ఉండబోతాయో మనం చూస్తాం’ అని వర్మ పేర్కొన్నారు. మరొక ట్వీట్లో..దక్షిణాది, ఉత్తరాది అనే భేదాలు లేకుండా భారతదేశం మొత్తం ఒకటే అనే భావన ఉండటం మంచిదన్నారు. ప్రాంతీయ సంస్కృతి, సంప్రదాయలను బట్టి భాషలు వృద్ధి చెందాయని గుర్తుచేశారు. భాష ప్రజలను కలపాలని, వేరు చేయొద్దని రామ్‌గోపాల్‌వర్మ కోరారు.