యాచారం, మార్చి 15 : ఓంకారేశ్వరాలయ భూములకు సంబంధించిన కౌలు రైతులు సకాలంలో బకాయి కౌలును పూర్తి స్థాయిలో చెల్లించి దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని దేవాదాయశాఖ జిల్లా కమిషనర్ రామకృష్ణ అన్నారు. మండలంలోని నందివనపర్తి గ్రామంలోని ఓంకారేశ్వరాలయాన్ని మంగళవారం సందర్శించారు. ఆలయంలోని పురాతన శివలింగాన్ని దర్శనం చేసుకున్నారు. అనంతరం ఓంకారేశ్వరాలయ భూముల కౌలు రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓంకారేశ్వరాలయ అభివృద్ధికి రైతులు, ప్రజాప్రతినిధులు సహకరించాలన్నారు. ఆలయానికి సంబంధించిన 1471 ఎకరాల భూమి ఓంకారేశ్వరుడి పేరుమీదనే ఉంటుందన్నారు.
దానికి సంబంధించిన దేవాలయ భూములపై రైతులకు ఎలాంటి హక్కులు లేవన్నారు. భూములను కౌలు చేసుకొని దేవాదాయశాఖకు కౌలును పూర్తి స్థాయిలో వెంటనే చెల్లించాలన్నారు. కౌలు సక్రమంగా చెల్లిస్తే ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఉగాది నుంచి కొత్త కౌలును ప్రారంభిస్తామన్నారు. చనిపోయిన రైతుల స్థానంలో కౌలు చేసుకోవడానికి వారి వారసుల పేర్లను నమోదు చేస్తామన్నారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్, ఇన్స్పెక్టర్ ప్రవీణ్, ఈవో ప్రవీణ్, సర్పంచ్‌లు కంబాలపల్లి ఉదయశ్రీ, టీఆర్ఎస్ నాయకులు బిలకంటి శేఖర్‌రెడ్డి, జోగిరెడ్డి, వెంకటయ్య, సుధాకర్, రైతులు ఉన్నారు.