దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 80,039 పోస్టులు భర్తీ చేస్తామని, 11,103 మంది ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయడంతో నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల బాటపడుతున్నారు. కొలువు సాధించాలన్న కొండంత ఆశతో గ్రంథాలయాల్లోనూ పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. మెటీరియల్ గ్రంథాలయాల్లో సందడి నెలకొంటున్నది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్టడీ సర్కిళ్లనూ ఏర్పాటు చేయగా, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి అండగా నిలుస్తున్నారు. ఉద్యోగాల జాతరను దృష్టిలో పెట్టుకుని రంగారెడ్డి జిల్లాలోని నగర శివారుల్లో పెద్ద ఎత్తున కోచింగ్ సెంటర్లు వెలిశాయి. శంషాబాద్, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, యాచారం, తుక్కుగూడ, శంకర్పల్లి, చేవెళ్ల, షాద్‌నగర్, షాబాద్, మొయినాబాద్, బాలాపూర్, బడంగ్పేట్, నాదర్గుల్, బీఎన్‌రెడ్డినగర్, తుర్కయంజాల్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 1561 ఉద్యోగాలు భర్తీ కానుండడంతో కష్టపడినవారికి కొలువు ఖాయమని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు.
ఇబ్రహీంపట్నం, మార్చి 13: సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 91వేల పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించి నిరుద్యోగుల్లో ఆశలు చిగురింపజేశారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సా ధించారు. ఇప్పటికే నిధులు, నీళ్లు రాబట్టారు. అలాగే నియామకాలను కూడా చేపట్టాలన్న సంకల్పంతో అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. దీంతో జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకుల్లో కొండంత ఆశ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 80,039 పోస్టులను భర్తీ చేయటంతోపాటు 11,103 మంది ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. త్వరలోనే నోటిఫికేషన్లనూ జారీ చేస్తామని చెప్పడంతో ఉద్యోగార్థుల్లో నూతనోత్సాహం మొదలైంది. ఉద్యోగాన్ని సాధించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం కోచింగ్ సెంటర్లకు వెళ్తుండటంతోపాటు సీనియర్ల సూచనలు, సలహాలు కూడా తీసుకుంటున్నారు. పుస్తకాల సేకరణలో నిమగ్నమవ్వగా.. బుక్ స్టాళ్లు, గ్రంథాలయాలు సందడిగా మారాయి. ప్రణాళికాబద్ధంగా చదివితే ఉద్యోగాన్ని సాధించొచ్చని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం వివిధ ఉద్యోగాలకు ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్లలో చేరేందుకు ఉద్యోగార్థులు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలోని నిరుద్యోగులు శివారులో వెలిసిన పలు కోచింగ్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు.
జిల్లాలో 1,561 ఉద్యోగాలు..
సీఎం కేసీఆర్ ప్రకటనతో జిల్లావాసులకు 1,561 ఉద్యోగాలు లభించనున్నాయి. అలాగే, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణతోపాటు ఇతర కేటగిరీల కింద జిల్లాకు మరిన్ని ఉద్యోగాలొచ్చే అవకాశాలున్నాయి. ఇందులో జోనల్, మల్టీ జోనల్‌స్థాయి ఉద్యోగాల కింద మరో 11,00 వరకు ఉద్యోగాలు రానున్నాయి. ఇందులో ఓపెన్ కేటగిరీ కింద అనుభవజ్ఞులైన వారు, ఈ ఉద్యోగాలకు కూడా పోటీపడే అవకాశాలుంటాయి. జోనల్ స్థాయి విధానం అమలు కానుండటంతో స్థానికులకే అటెండర్ నుంచి ఆర్డీవో స్థాయి వరకు ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయి.
శివారులో వెలుస్తున్న కోచింగ్ సెంటర్లు..
ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో జిల్లా పరిధిలోని శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కోచిం గ్ సెంటర్లు వెలుస్తున్నాయి. ఇప్పటివరకు హైదరాబాద్ నగరానికే పరిమితమైన కోచింగ్ సెంటర్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించడంతో నగర శివారులోని శంషాబాద్, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, యాచారం, తుక్కుగూ డ, శంకర్పల్లి, చేవెళ్ల, షాద్‌నగర్, షాబాద్, మొయినాబాద్, బాలాపూర్, బడంగ్‌పేట, బీఎన్‌రెడ్డినగర్, తుర్కయంజాల్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు అవుతున్నా యి. నిరుద్యోగులు ఉద్యోగాలను సాధించేందుకు అం దులో చేరుతున్నారు. ఇప్పటికే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎంకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్లో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. గతంలో ఈ కోచింగ్ సెం టర్లో చేరి అధిక సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు.
కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకుముందుకొస్తున్న ఎమ్మెల్యేలు
ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీయు వకుల కోసం ఎమ్మెల్యేలు సొంత డబ్బుతో కోచింగ్ సెం టర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గత మూడు దఫాలుగా ఉచిత కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటుచేసి నిరుద్యోగ యువతీయువకులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వటంతో సుమారు 368 మంది ఉద్యోగాలను సాధించారు. అలాగే, ఇప్పుడు కూడా ఉచితంగా కోచింగ్ సెం టర్లను ఏర్పాటు చేశారు. జిల్లాలోని మహేశ్వరం, షాద్‌నగర్, రాజేంద్రనగర్, చేవెళ్ల తదితర ప్రాంతాల్లోనూ స్థానిక ఎమ్మెల్యేలు నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్ ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
టీచర్ ఉద్యోగాన్ని సాధిస్తా..
బీఈడీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. చిన్నత నం నుంచి తల్లిదండ్రులు ఎం తో కష్టపడి నన్ను చదివించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కష్టపడి చదివి టీచర్ ఉద్యోగాన్ని సాధిస్తా.
-పున్నం అశ్విని, ఇబ్రహీంపట్నం