బొంరాస్‌పేట, మార్చి 13 : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బీపీఎల్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రతినెలా పంపిణీ చేస్తున్న బియ్యం పంపిణీ విధానానికి ప్రభుత్వం మళ్లీ బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీలో అవకతవకలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం బియ్యం పంపిణీలో ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఈ-పాస్) విధానాన్ని కొన్నేండ్ల కిందట నుంచి అమలు చేస్తున్నది. రేషన్కార్డుదారుడి ఆధార్‌ను ఈ-పాస్‌కు అనుధానం చేయడం ద్వారా బయోమెట్రిక్, ఐరిష్ విధానాల ద్వారా బియ్యం పంపిణీ చేసేది.
అయితే.. రెండేండ్ల కిందట కరోనా మహమ్మారి రావడం, వేలి ముద్రలు తీసుకోవడం వల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరుగుతుందని భావించిన సర్కారు ఈ విధానానికి స్వస్తి పలికి ఓటీపీ(వన్‌టైం పాస్వర్డ్) విధానం అమల్లోకి తెచ్చింది. లబ్ధిదారులు తమ ఫోన్ నంబర్లను ఆధార్‌కార్డుకు అనుసంధానం చేసుకోవడం ద్వారా ఫోన్‌కు వచ్చే ఓటీపీ ద్వారా రెండేండ్లుగా బియ్యం పొందుతున్నారు. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గడంతో ఓటీపీ విధానానికి బదులుగా పాత పద్ధతైన బయోమెట్రిక్ విధానం ద్వారానే బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేయడంతో డీలర్లు ఈ నెల నుంచే వేలి ముద్రలు తీసుకుని వినియోగదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నారు.
కరోనా తగ్గినందునే…
కరోనా తీవ్రత తగ్గడంతోనే ఓటీపీకి బదులుగా బయోమెట్రిక్ విధానంలో బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే డీలర్లకు ఆదేశాలు ఇవ్వగా వారు వినియోగదారులకు బియ్యం పంపిణీని ప్రారంభించారు. బయోమెట్రిక్‌తో పాటు ఓటీపీ విధానంలో కూడా బియ్యం తీసుకునే వెసులుబాటును వినియోగదారులకు కల్పించాం.
-మోతీలాల్, జిల్లా అదనపు కలెక్టర్