నందిగామ, మార్చి 13 : సమాజంలో మార్పు తీసుకు వచ్చి, ప్రతి ఒక్కరిలో శాంతిని నెలకొల్పేందుకు ధ్యానం ఎంతో ఉపయోగపడుతుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. రామచంద్ర మిషన్, హార్ట్ఫుల్ నెస్ ఎడ్యుకేషన్ ట్రస్టు, యునెస్కో సంయుక్త ఆధ్వర్యంలో గత సంవత్సరం 29వ ప్రపంచ వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ వ్యాస రచనపోటీల్లో 74 దేశాలకు చెందిన లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన భారత దేశ విద్యార్థులకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో ఆదివారం హార్ట్ఫుల్ నెస్ గురూజీ కమలేశ్ డీ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి హాజరయ్యారు. యునెస్కో ఎంజీఐఈపీ డైరెక్టర్ అనంత దురైప్ప, సినీ హీరోయిన్ కృతి శెట్టి, డైరెక్టర్ లింగస్వామితో కలిసి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అనంతరం కన్హా శాంతి వనంలో మొక్కలు నాటి, శాంతి వనంలోని గ్రీనరీని పరిశీలించారు. అనంతరం హార్ట్ఫుల్ నెస్ గురూజీ కమలేశ్ డీ పటేల్ మాట్లాడుతూ పిల్లల్లో వారి ఆలోచనలు ప్రతిబింబించే మార్గాలను మనం కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.