తెలంగాణ సర్కార్ విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నది. మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సర్కారు బడుల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులను సైతం మంజూరు చేసింది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో తొలి విడుతలో 464 స్కూళ్లను ఎంపిక చేయగా, ముందుగా ఏప్రిల్ ఫస్ట్ నుంచి 54 స్కూళ్లలో పనులను ప్రారంభించేందుకు జిల్లా విద్యా శాఖ ప్రణాళికను రూపొందించింది. మండలానికి రెండు పాఠశాలల్లో పనులు చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే నెలాఖరులోగా మిగతా అన్ని స్కూళ్లలోనూ మౌలిక వసతులను కల్పించనున్నారు. మొదటి విడుతలో ఒక్కో మండలంలోని 33 శాతం స్కూళ్లలో పనులు చేసి, రానున్న మూడేండ్లలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలను కల్పించేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది.
రంగారెడ్డి, మార్చి 29, (నమస్తే తెలంగాణ): మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ స్కూళ్లకు మంచి రోజులు రానున్నాయి. వారం రోజుల్లో పలు స్కూళ్లలో పనులు చేపట్టేందుకుగాను జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రణాళికను రూపొందించారు. ఏప్రిల్ ఒకటి నుంచి జిల్లాలోని 54 ప్రభుత్వ స్కూళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనులను చేపట్టనున్నారు. మండలానికి రెండు స్కూళ్ల చొప్పున విద్యాశాఖ అధికారులు ఎంపిక చేసి, ఆయా స్కూళ్లలో అవసరమయ్యే మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి అంచనాలను పూర్తి చేయడంతోపాటు నిధులను ఆయా స్కూళ్లకు సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో జమ చేసే ప్రక్రియనూ పూర్తి చేశారు. మరోవైపు మొదటి విడుతలో చేపట్టనున్న మిగతా స్కూళ్లలో మౌలిక సదుపాయాలను కల్పించే పనులను వచ్చే నెలాఖరులోగా ఏయే పనులు చేపట్టాలి, ఎన్ని రూ.కోట్ల నిధులు కావాలనే అంచనాలను పూర్తి చేసి పనులు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం అంతా సిద్ధం చేసింది.
ఇప్పటికే బడ్జెట్లో అధిక ప్రాధాన్యతనిస్తూ పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికను రూపొందించింది. రానున్న మూడేండ్లలో ప్రతీ ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు పూర్తిగా మార్చేలా ప్రభుత్వం ప్రగతి ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది. మొదటి విడుతలో జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 33 శాతం మేర పాఠశాలలను ఎంపిక చేశారు. సంబంధిత స్కూళ్లలో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను విద్యా సంవత్సరం ప్రారంభంలోగా పూర్తి చేయనున్నారు. ఇప్పటికే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, స్కూల్ డ్రెస్సులు కూడా ఉచితంగా అందిస్తుండడం, పదో తరగతి పరీక్షల్లో ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు, విద్యార్థుల దత్తత తదితర కార్యక్రమాలతో మెరుగైన ఫలితాలు సాధిస్తుండడం వంటి కసరత్తును అమలు చేస్తున్నారు.
ఏప్రిల్ ఫస్ట్ నుంచి పనులు షురూ..
విద్యాశాఖలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకుగాను ప్రత్యేక దృష్టి సారించిన సీఎం కేసీఆర్ ఆ దిశగా చర్యలను ముమ్మరం చేశారు. మన ఊరు-మన బడి కార్యక్రమం కింద మొదటి విడుతలో 33 శాతం స్కూళ్లను ఎంపిక చేయగా, మరో రెండేండ్లలో మిగతా అన్ని ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది. అయితే జిల్లావ్యాప్తంగా 1338 స్కూళ్లుండగా మొదటి విడుతలో 464 స్కూళ్లను ఎంపిక చేశారు. వీటిలో ప్రాథమిక పాఠశాలలు-261, ప్రాథమికోన్నత పాఠశాలలు-58, ఉన్నత పాఠశాలలు – 145 పాఠశాలలను ఎంపిక చేశారు. అంతేకాకుండా ఆయా మండలాల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న స్కూళ్లను పరిగణనలోకి తీసుకొని తొలి విడుతలో ఎంపిక చేశారు.
అయితే రానున్న విద్యాసంవత్సరంలో మౌలిక సదుపాయాలు కల్పించనున్న 464 స్కూళ్లకు సంబంధించి ఎంత బడ్జెట్ కావాలనే దానిపై జిల్లా విద్యాశాఖ అధికారులు అంచనాలను తయారు చేశారు. తొలి విడుతలో ఎంపిక చేసిన ఆయా స్కూళ్ల వారీగా ఏయే మౌలిక సదుపాయాలు కల్పించాలనే దానిపై ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయుల నుంచి వివరాలను సేకరించి అంచనాలను సిద్ధం చేశారు. అదేవిధంగా ఇప్పటికే జిల్లాలోని ఆయా స్కూళ్లకు అవసరమయ్యే నిధులకు సంబంధించి ప్రభుత్వానికి అంచనాలనూ జిల్లా విద్యాశాఖ సమర్పించింది. అయితే స్కూళ్ల మౌలిక సదుపాయాల కల్పన పనులను పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. 12 అంశాలను పరిగణనలోకి తీసుకుని జిల్లా విద్యాశాఖ అధికారులు అంచనాలను రూపొందించారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో తాగునీరు, ఫర్నిచర్, మరుగుదొడ్లు, విద్యుత్తు, గ్రీన్ చాక్బోర్డులు, పెయిటింగ్, ప్రహరీల నిర్మాణం, కిచెన్ షెడ్ల నిర్మాణం, శిథిలమైన తరగతి గదుల నిర్మాణం, మరమ్మతులు, డిజిటల్ విద్యకు అవసరమైన ఏర్పాట్లు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాళ్ల వంటి పనులకు అనుగుణంగా అంచనాలను రూపొందించారు.
వారం రోజుల్లో పనులు షురూ..
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా వారం రోజుల్లో పనులు ప్రారంభంకానున్నాయి. మొదటగా మండలానికి రెండు స్కూళ్లలో ఏప్రిల్ మొదటి వారంలో పనులు చేపట్టేందుకుగాను ఇప్పటికే అంచనాలను రూపొందించడంతోపాటు ఆయా స్కూళ్లలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు అవసరమయ్యే నిధులను ఆయా స్కూళ్ల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. మిగతా స్కూళ్లలో కూడా ఏప్రిల్ నెలాఖరులోగా పనులు చేపట్టేందుకు చర్యలు చేపట్టాం.
– సుశీంద్రరావు, జిల్లా విద్యాశాఖ అధికారి