ఇబ్రహీంపట్నం రూరల్, మార్చి 29: రంగారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామాల్ల్లో ఇంటి పన్ను వసూలు కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నది. నిర్ణీత గడువు కంటే ముందే పన్నులను వసూలు చేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 558 గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ వసూలు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 98శాతం పన్నులు వసూలైనట్లు డీపీవో శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోని 300 గ్రామాల్లో వంద శాతం పూర్తి కాగా, మిగిలిన 258 గ్రామాల్లోనూ నిర్ణీత గడువు లోపే లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు అధికారులు ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ పన్నులను వసూలు చేస్తున్నారు. జిల్లాలో రూ. 26,77,26,200 ఇంటి పన్నులు వసూలు కావాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.25,55,72,717 వసూ లయ్యాయి. మిగిలిన మొత్తాన్ని ఈ నెలాఖరులోపు పూర్తి చేస్తామని జిల్లా పంచాయతీరాజ్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
వంద శాతం పూర్తే లక్ష్యంగా..
జిల్లాలోని 258 గ్రామపంచాయతీల్లో వంద శాతం పన్నుల వసూలే లక్ష్యంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిరోజూ జిల్లా, మండలస్థాయి అధికారులతోపాటు పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది ఉదయం నుంచే గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు వారికి అవగాహన కల్పిస్తూ పన్నులను వసూలు చేస్తున్నారు. పన్నులను సకాలం లో చెల్లిస్తేనే గ్రామాల్లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల వేతనాలు, వీధి దీపాల ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణ, నీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం, రోడ్లకు మరమ్మతులు, పంచాయతీ ట్రాక్టర్లు, ఆటోల నిర్వహణ వంటి పనులకు నిధులను ఖర్చు చేసే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. ఈనెలాఖరులోపు టార్గెట్ పూర్తికి చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులను అధికారులు ఎప్పటికప్పుడు గ్రామపంచాయతీ ఖాతాల్లో జమ చేస్తున్నారు.
ఈనెలాఖరు లోపు పూర్తి చేస్తాం
రంగారెడ్డి జిల్లాలోని 558 గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే 300 గ్రామాల్లో వంద శాతం పన్నులను వసూలు చేశాం. మిగిలిన 258 గ్రామాల్లోనూ వసూలుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రతిరోజూ పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది ఇంటింటికీ తిరిగి ప్రజలకు అవగాహన కల్పిస్తూ పన్నులను వసూలు చేస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి ఆ 258 గ్రామాల్లోనూ వంద శాతం పన్నులను వసూలు చేస్తాం.
-శ్రీనివాస్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా
వందశాతం పన్నులు వసూలు చేశాం
ప్రతిఏడాది గ్రామంలోని ప్రజలందరూ ఇంటి పన్నులను సకాలంలోనే చెల్లిస్తున్నారు. గతేడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా గ్రామంలో వంద శాతం పన్నులను నిర్ణీత గడువుకు ముందే వసూలు చేశాం. గ్రామంలోని 80 శాతం మంది ప్రజలు గ్రామపంచాయతీ కార్యాలయానికే వచ్చి పన్నులను చెల్లించారు. గ్రామాభివృద్ధికి గ్రామస్తుల సహకారం మరువలేము.
– సైదులు, పంచాయతీ కార్యదర్శి, తుర్కగూడ