షాద్‌నగర్ రూరల్, మార్చి 29: అన్ని కాలాల్లోనూ కూరగాయలకు డిమాండ్ ఉంటుంది. రవాణా వ్యవస్థ మెరుగుపడటం, లాభసాటి ధరలు ఉండటంతో కూరగాయల సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. రైతులు ఏ కాలంలో ఏ పంటలను సాగు చేయాలి.. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడిని ఎలా సాధించాలో తదితర అంశాలపై ఫరూఖ్‌నగర్ మండలంలోని రైతులకు వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలతో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుండటంతో వారు మంచి ఫలితాలను సాధిస్తున్నారు. వరికి బదులుగా కూరగాయలు, ఇతర అంతర పంటలను సాగు చేసి ఆర్థికంగా ఎదుగుతున్నారు.
తక్కువ నీటితో తీగ జాతి పంటలను సాగు చేస్తే అధిక దిగుబడితోపాటు లాభాలు వస్తాయని ఉద్యానవనశాఖ అధికారులు అవగాహన కల్పించడంతో పలువురు రైతులు ఆ పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా ఉద్యానవన శాఖాధికారులు సబ్సిడీ కింద కొన్ని పరికరాలను కూడా రైతులకు అందిస్తుండటంతో మండలంలోని చిల్కమర్రి, కమ్మదనం, మొగిలిగిద్ద, వెలిజర్ల తదితర గ్రామాలకు చెందిన రైతులు ఈ పంటలను అధికంగా సాగు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యానవన శాఖ ద్వారా రైతులకు సబ్సిడీపై బిందుసేద్యం పరికరాలను అందజేస్తున్నది. దీంతో రైతులు వివిధ రకాల కూరగాయల ను సాగు చేస్తూ లాభాలను గడిస్తున్నారు.
పందిరి పద్ధతిలో కూరగాయల ను సాగు చేసి, తక్కువ సమయంలోనే పంట ఉత్పత్తులు రావడంతో మార్కెట్‌కు తరలించి లాభాలను పొందుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో పందిరి సాగు పంటలకు మంచి డిమాండ్ ఉంది. ఈ సాగులో 45 రోజుల్లోనే దిగుబడులు ప్రారంభమవుతున్నాయి. మూడునెలల వరకు పంటను రైతు మా ర్కెట్లో విక్రయించుకుంటాడు. ఒక ఎకరం భూమిలో తీగ జాతి కూరగాయలను సాగు చేస్తే సుమారు రూ.45 వేల వరకు ఖర్చు అవుతుంది. కూలీల ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది.
అందరికీ ఆదర్శం.. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి
మండలంలోని చిల్కమర్రి గ్రామానికి చెందిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తీగ జాతి పంటలను సాగుచేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తనకున్న రెండెకరాల పొలంలో గతంలో వరి, జొన్న తదితర పంటలను సాగు చేసేవాడు. కానీ ఆశించిన స్థాయిలో లాభం వచ్చేది కాదు. దీంతో ఉద్యానవన శాఖ అధికారుల సూచనలతో పందిరి సాగులో కూరగాయలను పండిస్తున్నాడు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పరికరాలను సద్వినియోగం చేసుకుంటూ అధికంగా లాభాలను ఆర్జిస్తున్నాడు. ప్రవీణ్ కుమార్‌రెడ్డి రెండెకరాల పొలం లో పందిరి పద్ధతిలో సోరకాయ పంటను సాగు చేస్తున్నాడు. ప్రభుత్వం బిందుసేద్యం పరికరాలను సబ్సిడీపై అందజేసింది. సోరకాయ సాగుకు సుమారు రూ.45 వేలను ఖర్చుచేశాడు. సాగుకు సేంద్రియ, రసాయనిక ఎరువును వాడుతున్నాడు. వీటి దిగుబడి కేవలం 60 రోజుల నుంచే ప్రారంభమవుతుంది. ఏడాదిగా దిగుబడి వస్తుడటంతో లాభాలను ఆర్జిస్తున్నాడు.
రైతులకు ప్రభుత్వం
రైతులు పందిరి విధానం లో పంటలను సాగు చేయాలి. ప్రభుత్వం వీటి సాగుకు సబ్సిడీని కూడా ఇస్తున్నది. ప్రభుత్వం రైతుల ను అండగా ఉండటం సంతోషకరం. సీఎం కేసీఆర్ ప్రభు త్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలోని రైతులు ఆర్థికంగా ఎదుగుతున్నారు.
-శ్రీనివాస్‌రెడ్డి సర్పంచ్,చిన్నచిల్కమర్రి గ్రామపంచాయతీ
పంటలపై అవగాహన కల్పిస్తున్నాం
పందిరి పద్ధతిలో కూరగాయల సాగులో మంచి లాభాలున్నాయి. సబ్సిడీపై బిందుసేద్యం పరికరాలను అందిస్తున్నాం. తక్కువ నీటితో ఈ కూరగాయలను సాగు చేయొచ్చు. గ్రామాల్లోని రైతులకు సదస్సులను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తు న్నాం. వీటి సాగుతో వచ్చే లాభాలను రైతన్నలకు వివరిస్తున్నాం. దీంతో మండలంలోని రైతులు పందిరి సాగు పంటలపై ఆసక్తి చూపుతున్నారు.
-ఉషారాణి, ఉద్యానవనశాఖ అధికారి
60 రోజుల నుంచి పంట దిగుబడి
పందిరి పద్ధతిలో కూరగాయలను సాగు చేస్తే మంచి లాభాలున్నాయి. రెండెకరాల్లో సోరకాయ పంటను సాగు చేస్తున్నా. రూ.80వేల వరకు ఖర్చు అయ్యింది. 60 రోజుల నుంచి పంట దిగుబడి వస్తుంది. మంచి లాభాలు వస్తున్నాయి. ప్రభుత్వం సబ్సిడీపై పరికరాల ను అందించింది. అంతేకాకుండా ఉద్యానవన శాఖ అధికారుల సూచనలు, సలహాలను పాటిస్తున్నా. రైతన్నలు పందిరి సాగుపై దృష్టి సారిస్తే అధిక లాభాలను ఆర్జించొచ్చు.
-ప్రవీణ్‌కుమార్‌రెడ్డి రైతు, చిల్కమర్రి గ్రామం
దొండకాయ సాగుతో లాభాలు
నాకున్న రెండు ఎకరాల్లో దొండకాయ పంటను పందిరి విధానంలో సాగు చేస్తున్నా. ప్రభుత్వం సబ్సిడీని అందించింది. ఈ పంట సాగుకు రూ. 80 వేల వరకు ఖర్చు చేశా. పంట దిగుబడి త్వరగా వస్తుంది. ప్రతినెలా లాభాలను పొం దొచ్చు. ప్రభుత్వ సహకారాన్ని మరువలేను.
-సత్యనారాయణరాజు రైతు,చిన్నచిల్కమర్రి