రంగారెడ్డి, మార్చి 29, (నమస్తే తెలంగాణ): రోడ్డు ప్రమాదాలు జరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని కోర్టు హాల్లో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ అధ్యక్షతన రోడ్డు భద్రత కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు మూలమలుపులు, జంక్షన్ల వద్ద ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించేలా అంబులెన్స్‌లను, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచేలా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను దవాఖానల్లో చేర్చేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రమాదాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇంటిగ్రేటెడ్ రోడ్డు యాక్సిడెంట్ డేటాబేస్‌లో పొందుపర్చాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల వద్ద ప్రమాదాలు జరగకుండా స్పీడ్ బ్రేకర్స్, స్కూల్ జోన్ సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ రహదారులపై వాహనాలు వేగంగా వెళ్లకుండా స్పీడ్ లిమిట్‌ను అమలుచేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ శ్రవణ్ ప్రకాశ్, డీఈవో సుశీంద్రరావు, డీటీసీ ప్రవీణ్ రావు, రాచకొండ డీసీపీ శ్రీబాల, సైబరాబాద్ డీసీపీ ఎల్సీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.