షాద్‌నగర్, మార్చి29 : పదో తరగతి విద్యార్థిని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్ప డిన విషాద ఘటన షాద్‌నగర్ పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం కుమ్మరోనిపల్లి గ్రామానికి చెందిన మన్నారి గాయత్రి (16) ఫరూఖ్‌నగర్ మండలం కమ్మదనం గ్రామంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నది. ఈ నెల 27న నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని గురుకుల జూనియర్ కళాశాలలో పరీక్ష రాసేందుకు తల్లిదండ్రులతో కలిసి వెళ్లింది. పరీక్ష రాసిన అనంతరం గాయత్రి కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు అచ్చంపేట పోలీసులకు సమా చారమిచ్చారు. మంగళవారం ఉదయం షాద్‌నగర్ పట్టణంలోని కేశంపేట రోడ్డు సమీపంలోని రైలు పట్టాలపై ఆమె శవమై కనిపించింది. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతిచెందిన బాలిక గాయత్రిగా ధ్రువీకరించారు. మహబూబ్‌నగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి గాయత్రి ఆత్మహత్య చేసుకుందని, ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని రైల్వే పోలీసులు తెలిపారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.ఈ విషయం కమ్మదనం గురుకుల పాఠశాలలో తెలియడంతో విషాద వాతావరణం నెలకొన్నది. తోటి విద్యార్థినులు కన్నీరుమున్నీరయ్యారు.