రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ యంత్రాంగం జిల్లాలో సాగైన అన్ని పంటల వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తున్నది. ఇప్పటికే పంటల వివరాల సేకరణ తుది దశకు చేరుకోగా, ఏ రైతు ఎన్ని ఎకరాల్లో ఏ పంట వేశాడు, సర్వే నంబర్, విత్తన రకం, ప్రధాన పంట ఏది, అంతర పంట, నీటి వసతి తదితర వివరాలను సేకరించి రైతులతో సంతకాలను సైతం చేయించారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 85,552 ఎకరాల్లోని పంటల వివరాలను వ్యవసాయాధికారులు ఆన్లైన్లో పొందుపర్చారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనబోమని తెలిపిన నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ ఇతర పంటలు వేయాలని రైతుల్లో అవగాహన కల్పించడంతో సత్ఫలితాలు వచ్చాయి. ఈసారి అత్యధికంగా వరి సాగు తగ్గింది.
రంగారెడ్డి, మార్చి 28, (నమస్తే తెలంగాణ): పంటల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చే ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు యాసంగి సీజన్లో రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఆన్లైన్లో నమో దు చేస్తున్నారు. ఈ ప్రక్రియ గత రెండేండ్లుగా సాగుతున్నది. వ్యవసాయ విస్తరణ అధికారులు జిల్లాలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ రైతుల వారీగా సాగు విస్తీర్ణం వివరాలను ఆన్లైన్లో ఎంట్రీ చేస్తున్నారు.అదేవిధంగా భూయజమాని ఫోన్‌నంబర్ తదితర వివరాలను మరో యూనిట్‌గా తీసుకొని ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తున్నారు. పంట ఉత్పత్తులను విక్రయించుకునే సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రక్రియను చేపట్టింది. అంతేకాకుండా బోరు, బావులు, చెరువుల ద్వారా రైతులు సాగు చేస్తు న్న పంటల ద్వారా రానున్న దిగుబడిని కూడా అంచనా వేయనున్నారు.
ఇప్పటివరకు 85,552 ఎకరాల వివరాల నమోదు
జిల్లాలో పంటల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చే ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. ఇప్పటివరకు జిల్లాలోని 85,552 ఎకరాల వివరాలను వ్యవసాయాధికారులు ఆన్లైన్లో నిక్షిప్తం చేశారు. పంటల వివరాలను ఆన్లైన్లో ఎంట్రీ చేయని రైతుల వద్ద వారి ఉత్పత్తులను సేకరించే విషయంలో ఇబ్బందులు తలెత్తనున్న దృష్ట్యా రైతులందరూ తాము సాగు చేసే పంటల వివరాలను ఆన్లైన్ చేయించుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. రైతులవారీగా సర్వేనంబర్, సా గు విస్తీర్ణం, పంట, విత్తన రకం, ప్రధాన పంట, అంతర పంట, నీటి వసతితోపాటు రైతుల సంతకాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు. మరోవైపు వరికి బదులు గా ఇతర పంటలను సాగు చేయాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించింది.
యాసంగి సీజన్ ప్రారంభం ముందు నుంచే వరికి బదులుగా ఇతర డిమాండ్ కలిగిన పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పించారు. వానకాలం సీజన్ నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం కిరికిరి పెడుతున్న దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వం రైతులకు క్షేత్రస్థాయిలో ఇతర పంటలను సాగు చేసి మంచి దిగుబడిని పొందాలని గ్రామాల్లో అవగాహన కల్పించడంతో చాలామంది రైతులు ఇతర పంటల సాగుకు మొగ్గు చూపారు. దీంతో ప్రభుత్వ సూచనలతో గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం జిల్లాలో వరి సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది. ఇతర పంటలైన శనగ లు, వేరుశనగ, జొన్న, పెసర్లు, చిరుధాన్యాలు తదితర పంటల సాగు పెరిగింది. గతేడాది యాసంగిలో 80 వేల ఎకరాల వరకు వరి పంట సాగు కాగా.. ఈ యా సంగిలో 47,201ఎకరాల్లోనే సాగు అయ్యింది. దాదా పు 30వేల ఎకరాలకుపైగా వరి సాగు జిల్లాలో తగ్గింది.
అధికారులు ఆన్లైన్లో నమోదు చేసిన పంటల వివరాలు
వరి-47,201 ఎకరాలు , మొక్కజొన్న-10,043, జొన్న-696, చిరుధాన్యాలు-61, శనగలు-6237, మినుములు-134, ఆముదం-117, మేతజొన్న-1456, పెసర్లు-78, వేరుశనగ-10,130, ఉలువలు -41, ఆవాలు-20, పారాగడ్డి-2392, రాగులు-25, ఎర్రజొన్న-130, కుసుమ పువ్వు-5108 , నువ్వులు -36, చెరుకు-112, పొద్దుతిరుగుడు-1158, తీపి మొక్కజొన్న-21, గోధుమ-83, నేపియర్ గడ్డి-110 ఎకరాల్లో పంటల వివరాల సేకరణతోపాటు ఆన్లైన్లో ఎంట్రీ ప్రక్రియ కూడా పూర్తయ్యింది.
వారం రోజుల్లో పూర్తికి చర్యలు
జిల్లాలో పంటల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చే ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలోని రైతులందరి వివరాల ను సేకరిస్తున్నాం. రైతులు కూడా తాము సాగు చేస్తున్న పంటల వివరాలను ఆన్లైన్లో స్థానిక వ్యవసాయాధికారుల వద్ద నమోదు చేయించుకోవాలి. పంట కొనుగోలు సమయంలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. గతంతో పోలిస్తే జిల్లాలో వరి సాగు తగ్గి, ఇతర పంటల సాగు గణనీయంగా పెరిగింది. – గీతారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి