ఇబ్రహీంపట్నం, మార్చి 28 : ఇబ్రహీంపట్నం పెద్దచెరువు సుందరీకరణ పనులకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల ఇబ్రహీంపట్నంలో పర్యటించిన సందర్భంగా చెరువు సుందరీకరణ పనులకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు కేటాయించిన నిధులు రూ.12కోట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి హెచ్ఎండీఏ అధికారులను ఆదేశించారు. ఇందులోభాగంగా సోమవారం హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం చెరువును పరిశీలించారు. చెరువుకట్టను వెడల్పుచేసి కట్టకు ఇరువైపులా పార్కులు, చిల్డ్రన్ పార్కులు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. పెద్దచెరువులో విహరించేందుకు పర్యాటకుల కోసం రెండు బోట్లు, బోట్ల నిర్వహణతోపాటు చెరువుకట్ట సమీపంలో రెస్టారెంట్‌ను కూడా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
హెచ్ఎండీఏ ఇంజనీర్ బీఎల్ఎన్రెడ్డి మాట్లాడుతూ.. పర్యాటకులను ఆకర్శించేలా కార్యక్రమాలను ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను సమన్వయం చేసుకుని చేపడుతామన్నారు. చెరువు సుందరీకరణ పనుల కార్యక్రమాలపై త్వరలో ఒక నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి అందజేస్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఎస్సీ పరంజ్యోతి, ఈఈ పద్మ, డీఈ వెంకటరమణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, ఎంపీపీ కృపేశ్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలున్నారు.
మాజీ సర్పంచ్ మల్లేశ్ సేవలు మరువలేనివి
యాచారం, మార్చి 28 : గడ్డమల్లయ్యగూడ మాజీ సర్పంచ్, టీఆర్ఎస్ మండల నాయకుడు నర్రె మల్లేశ్ చేసిన సేవలు ఏనాటికీ మరువలేనివని టీఆర్ఎస్ జిల్లా అద్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందిన మల్లేశ్ స్వగ్రామంలో సోమవారం నిర్వహించిన దశదినకర్మ కార్యక్రమానికి ఆయన టీఆర్ఎస్ నాయకులతో కలిసి హాజరయ్యారు. మల్లేష్ చిత్రపటానికి నివాళులర్పించారు. మల్లేశ్ కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం మల్లేశ్ కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, పలు రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్తులు బాధాతప్త హృదయాలతో ఆయన చిత్రపటానికి నివాళులర్పిస్తూ కన్నీళ్ల పర్యంతమయ్యారు.