తెలంగాణ ప్రజలు నూకలు తినండంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్అవహేళనగా మాట్లాడినందుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలు భగ్గుమంటున్నారు. ఏదిఏమైనా వరిధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని, లేదంటే ఊరుకునేది లేదని అన్నదాతల నుంచి ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. వరిధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ కిరికిరి రాజకీయం చేస్తూ పంట చేతికొచ్చాక ద్వంద్వ వైఖరేందని రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. రైతులంటే బీజేపీకి చులకన భావం ఉన్నదని, యాసంగి వడ్లు కొనకపోతే రాష్ట్రంలో బీజేపీ కనుమరుగు కావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.
పరిగి/షాబాద్, మార్చి 27 : ఏదైనా ఒక అంశంపై రాజకీయ పార్టీకి ఒకే విధానం ఉండడం సర్వసాధారణం.. వరి విషయంలో భారతీయ జనతా పార్టీది రెండు నాల్కల ధోరణి కావడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేసే పరిస్థితి లేదని, ఎవరైనా రైస్‌మిల్లర్లతో ఒప్పందం చేసుకొని వడ్లు వేసుకుంటే మీ ఇష్టం, లేదంటే యాసంగిలో వరి వేయకపోవడమే మంచిదని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయమని పేర్కొన్నారు. కాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాసంగి సీజన్ ప్రారంభంలో రైతులు వరి పండించండి, కొనుగోలు చేస్తామని ప్రకటించారు. తీరా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాటలు విని కొందరు రైతులు వరి పంటను పండించారు.
గత యాసంగితో పోలిస్తే సుమారు 45శాతం పైగా వరి సాగు విస్తీర్ణం తగ్గినా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు కదా వడ్లు కొనుగోలు చేయిస్తారేమోనని నమ్మి వరి వేశారు. పంట చేతికి వచ్చి వరి ధాన్యం ఇంటికి చేరే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని వడ్లు కొనుగోలు చేయాలని కోరగా తాము ఎట్టి పరిస్థితిలో బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. అంతేగాకుండా మీ ప్రజలతో నూకలు తినిపించండి అంటూ అవహేళన మాటలు మాట్లాడడం రైతులను మరింత బాధించింది.
కేంద్ర మంత్రి ఇంత చులకనగా మాట్లాడడం సహేతుకం కాదంటున్నారు రైతులు. ఒక అంశంపై బీజేపీలోని కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు వేర్వేరు విధానాలు అవలంబించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. రైతుల విషయంలో మొదటి నుంచి బీజేపీది వ్యతిరేక విధానమేనని పలువురు మండిపడుతున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా, కిరికిరి రాజకీయాలు చేయడం ఆ పార్టీకి సైతం మంచిది కాదంటున్నారు. 75 ఏండ్ల స్వాతంత్య్ర భారత దేశంలో అధికారంలో ఉన్న పార్టీలన్నీ తమకు అనుకూలంగా చట్టాలు తయారు చేసుకోగా లేనిది, రైతుల కోసం కొన్ని సడలింపులు ఇచ్చి కేంద్రం వడ్లు కొనుగోలు చేయవచ్చు కదా అని పలువురు పేర్కొంటున్నారు. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం స్పందించకుంటే రాబోయే ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం ఖాయమని రైతులు హెచ్చరిస్తున్నారు.
కొనమంటే ఎవరికి అమ్మాలి..
అప్పుడేమో కొంటామని బీజేపీ వాళ్లే చెప్పారు. ఇప్పుడు కొనమని చెబితే పండించిన వడ్లు ఎవరికి అమ్ముకోవాలి. పంట సాగుకు వేల పెట్టుబడి పెట్టుకున్నాం. పంట చేతికి వచ్చే సమయంలో ఇట్లంటే ఎక్కడికి పోవాలి.. ఎవరిని అడుగాలి. పొట్ట చేత పట్టుకొని పంట చేసుకొంటున్నాం. సంవత్సరంలో పండించే పంటే మా ఆస్తి. అమ్ముకొని ఏడాది పొడవునా కడుపు నింపుకొంటున్నాం. ఇప్పటికైనా రైతుల కష్టాలను తెలుసుకొని పంటను కొనండి.
– సమనోళ్ల సావిత్రమ్మ, పర్సాపూర్, కొడంగల్.
కేంద్రంది నరంలేని నాలుక
తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నది. మన రాష్ట్ర బీజేపీ నాయకులు ధాన్యం కేంద్రమే కొంటుందంటారు. కేంద్రంలోని పెద్దలు కొనమంటారు. ఇదేంది.. వారి మధ్యనే ఏకాభిప్రాయం లేదు. కేంద్రంలోని పెద్దల నాలుక నరంలేనిదని మరోసారి వెల్లడైంది.
– రొంపల్లి మొగులమ్మ, కోకట్ గ్రామ రైతు, యాలాల మండలం
కక్ష సాధింపు తగదు..
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై కక్షసాధింపు చర్యలు చేస్తున్నది. రాష్ట్రంలో బీజేపీ నాయకులు వరి వేయండి కేంద్రంతో తప్పకుండా కొనిపిస్తామని గతంలో చెప్పారు. కానీ నేడు కేంద్ర మంత్రులు తెలంగాణలో పండించిన యాసంగి ధాన్యం కొనమని కచ్చితంగా చెప్పుతున్నది. అప్పట్లో రాష్ట్ర బీజేపీ నాయకులు భరోసా కల్పించగా కొంత మంది రైతులు ముందుకు వచ్చి వరి ధాన్యం పండించారు. ఇప్పుడు ఈ విధంగా మాట్లాడి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. కేంద్రం ద్వంద్వ వైఖరి మార్చుకొని రైతు కష్టాలను గుర్తించాలి. ధాన్యం కొనుగోల చేయాలి.
– చిదిరి వినోద్‌కుమార్, చిన్ననందిగామ, కొడంగల్
బీజేపీకి నూకలు చెల్లాయి
రైతులను కన్నీరు పెట్టించిన ప్రభుత్వాలు కనుమరుగయ్యాయి. ప్రస్తుతం బీజేపీ రైతులపై వివక్ష చూపుతున్నది. బీజీపీకి ఇక నూకల చెల్లాయి. తెలంగాణ రాష్ట్రంలో పండించిన వరి ధాన్యాన్ని కొనకపోవడంలో ఆంతర్యమేమిటి. తప్పకుండా ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలి. తెలంగాణ ప్రజలు, రైతులను కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదు. బీజీపీకి తగిన గుణపాఠం చెబుతాం.
– మల్లేశ్, రైతు, ఫరూఖ్‌నగర్ మండలం
ద్వంద్వ వైఖరికి వారి మాటలే నిదర్శనం
మన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి రైతు బాగుంగాలని కృషి చేస్తుంటే కేంద్రం విడగొట్టడానికి చూస్తున్నది. కేంద్ర విధానాలు తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఇకనైనా కేంద్రం వడ్లు కొనుగోలు చేయాలి. లేకపోతే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రైతుల సత్తా చూపుతాం. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
– రాస్నం రామచంద్రయ్య, కోకట్ గ్రామ రైతు, యాలాల మండలం
ధాన్యం కొనాల్సిందే..
తెలంగాణ రైతులను అవమానిస్తే ఊరుకునేది లేదు. రాష్ట్ర ప్రజలు నూకలు తినాలని కేంద్రమంత్రి వ్యాఖ్యలు చేయడం సరికాదు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం చెప్పేదొకటి.. చేసేది మరోలా ఉన్నది. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనాల్సిందే. లేదంటే ఉద్యమం తప్పదు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించం.
– లెక్కల విఠల్‌రెడ్డి, బాటసింగారం రైతు సహకార సంఘం చైర్మన్
కేంద్రానికి ఉసురు తగులుతది
కేంద్ర ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతది. ధాన్యం కొనుకుంటే ఎట్లయితది. రైతులకు అన్యాయం చేయొద్దు. నూకలు తినాల్సిన అవసరం మాకు లేదు. రాష్ట్ర రైతులకు కేంద్ర మంత్రి క్షమాపణలు చెప్పాలి. తెలంగాణ రైతులంటే కేంద్రానికి ఇంత చులకననా. మేం మనుషులం కాదా? మేం పండించేది ఎట్ల కొనరో చూస్తం. కొనేదాకా మరో ఉద్యమమే చేస్తం.
– బర్రె కృష్ణ, రైతు
కేంద్ర ప్రభుత్వం వడ్లు కొని తీరాల్సిందే
తెలంగాణ ప్రజలు పండించిన వడ్లను కేంద్రం కొనాల్సిందే. మొండి వైఖరిగా ప్రవర్తిస్తే తగిన గుణపాఠం తప్పదు. రాష్ట్రంలో వడ్లను కొంటామని రాష్ట్ర బీజేపీ నేతలు, కేంద్రంలోని పెద్దలు కొనమని రెండు విధాలుగా మాట్లాడటం సమంజసం కాదు. పంజాబ్ రాష్ట్రంలో పండించిన వడ్లను కొంటున్న కేంద్రం తెలంగాణలో రైతులు పండించిన వడ్లను కొనకపోవడం సిగ్గుచేటు, దానికి తోడు రైతులకు కించపరచినట్లు మాట్లాడటం సరికాదు
-డీవై ప్రసాద్, పెద్దేముల్, పెద్దేముల్ మండలం
కేంద్రం పూటకోమాట చెప్పడం సబబు కాదు
పంజాబ్ రాష్ర్టానికి చెందిన రైతులు పండించిన రెండు పంటలను కొనుగోలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు పండించిన వడ్లను మాత్రం కొనకపోవడం విడ్డూరం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో పండించిన వడ్ల కొనుగోలుపై పూటకో మాట చెబుతూ పబ్బం గడిపి తెలంగాణ రైతాంగాన్ని అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నది. కేంద్రానికి తగిన గుణపాఠం తప్పదు.
– అనురాధ, రుక్మాపూర్, పెద్దేముల్ మండలం
కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని మార్చుకోవాలి
రాష్ట్రంలో బీజేపీ నాయకులు వరి వేయండి కేంద్రంతో తప్పకుండా కొనిపిస్తామని గతంలో చెప్పారు. కానీ నేడు కేంద్ర మంత్రులు తెలంగాణలో పండించిన యాసంగి ధాన్యం కొనమని కచ్చితంగా చెబుతున్నారు. అప్పట్లో రాష్ట్ర బీజేపీ నాయకులు భరోసా కల్పించగా కొంత మంది రైతులు ముందుకు వచ్చి వరి ధాన్యం పండించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై కక్షసాధింపు చర్యలు చేస్తుంది. ద్వంద్వ వైఖరి మార్చుకొని రైతు కష్టాలను గుర్తించి ధాన్యం కొనుగోలు చేయాలి.
– ఎం.వెంకటేశం, రైతు నాగసముందర్, ధారూరు మండలం
కేంద్ర ప్రభుత్వం సమన్యాయం పాటించాలి
దేశాన్ని పాలించే కేంద్రానికి అన్ని రాష్ర్టాలకు ఒకే విధమైన సౌలభ్యాలు కల్పించాలి, కానీ కేంద్రాన్ని పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో పంజాబ్‌కు ఒక విధానం, తెలంగాణకు మరో విధానాన్ని అమలు చేస్తున్నది. ఇదెక్కడి న్యాయం రాష్ట్రంలో సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి, ధాన్యం ఉత్పత్తి మరింత పెరుగుతుంది. ఇప్పుడు కేంద్రం బాధ్యతను విస్మరించింది. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్, ధరలను వెంటనే తగ్గించాలి. – రాంచంద్రయ్యగౌడ్, రైతు నాగారం, ధారూరు మండలం
వరి ధాన్యాన్ని కొని తీరాల్సిందే..
కేంద్ర ప్రభుత్వం మేము పండించిన వరి ధాన్యాన్ని కొని తీరాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని వసతులు కల్పించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తుంటే కేంద్రం సహకారం అందించకపోగా, రైతులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదు. ధాన్యాన్ని ఎట్టి పరిస్థితిల్లో కొనితీరాలి.
– గోపాల్, రైతు, తుమ్మలపల్లి, జిల్లెడు చౌదరిగూడ మండలం.