యాసంగి వరిధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందేనని రోజురోజుకూ పోరు ఉధృతమవుతున్నది. ఊరూరా సమావేశాలు నిర్వహించి రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు తీర్మానాలు చేసి ప్రధాని మోదీకి ప్రతులను పంపిస్తున్నారు. ఆదివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా తీర్మానాల కాపీలను కొరియర్, పోస్టుల్లో పంపించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాకే వ్యవసాయం పండుగైందని, సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మించడంతో పాటు మిషన్‌కాకతీయతో చెరువులకు పునర్వైభవం వచ్చి పుష్కలంగా సాగు నీరు అందుతుండడంతో రాష్ట్రమంతా సస్యశ్యామలమైందని పలువురు పేర్కొన్నారు. ఆత్మగౌరవంతో బతికే తెలంగాణ రైతులను నూకలు తినండని కేంద్ర మంత్రి మాట్లాడడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే రాబోవు రోజుల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. రైతుల శ్రేయస్సు కోరే టీఆర్ఎస్ పార్టీ ముందుండి కేంద్రంపై యుద్ధం చేస్తుందన్నారు.
షాబాద్, మార్చి 27: తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన వరిధాన్యాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ గ్రామాల్లో సమావేశాలు నిర్వహిస్తున్న రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు ఏకగ్రీవంగా తీర్మానాలు చేస్తున్నారు. ఇలా రైతుల కోసం ప్రతి ఊరూ కదిలివస్తున్నది. వడ్లు కొనాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ సర్కార్ యుద్ధం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రంగారెడ్డిజిల్లాలో నాలుగు రోజులుగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆదివారం జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో రైతులు, ప్రజాప్రతినిధులు ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. ఈ మేరకు ఆయా గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల సభ్యులు సమావేశాలు ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం వరిధాన్యం కొనాలని తీర్మానాలు చేసి ప్రధాని మోదీకి కొరియర్, పోస్టుల్లో పంపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తూ ఆదుకుంటుంటే..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని రైతులు, రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రైతు బంధు, రైతు బీమా పథకాలతో అన్నదాతలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారు. వ్యవసాయానికి 24గంటల నిరంతర కరెంట్ సరఫరాతో రైతులు పుష్కలంగా పంటలు పండించుకుంటున్నారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేయాలని కేంద్రానికి చెబితే.. తెలంగాణ ప్రజలు నూకలు తినండని కేంద్ర మంత్రి అనడం సిగ్గుచేటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలను, రైతులను అవమానపరిచేలా మాట్లాడిన కేంద్ర మంత్రి వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. గ్రామాల్లో వడ్లు కొనాలని నిర్వహిస్తున్న ఏకగ్రీవ తీర్మానాల కార్యక్రమాలకు ప్రజలు, రైతులు పెద్దఎత్తున కదిలివస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలోని పలు గ్రామపంచాయతీల తీర్మానాలు
పరిగి, మార్చి 27 : కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రైతులు పండించిన వడ్లు కొనుగోలు చేయాలంటూ వికారాబాద్ జిల్లా పరిధిలోని పలు గ్రామపంచాయతీల్లో ఆదివారం ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. బీజేపీ నాయకులు వడ్లు వేయాలని చెప్పి తీరా పంట చేతికి వచ్చిన సమయంలో కేంద్రం వడ్లు కొనుగోలు చేయబోమంటూ చెప్పడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా పరిధిలోని పలు గ్రామపంచాయతీల ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ‘యాసంగిలో తమ గ్రామంలో పండించిన వడ్లు కేంద్రం కొనుగోలు చేయాలి’ అంటూ ఏకవాక్య తీర్మానాలు చేశారు. ఈ తీర్మానాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు పంపిస్తామని సర్పంచ్‌లు తెలిపారు. మండల పరిషత్, పీఏసీఎస్, జిల్లాపరిషత్లోనూ వడ్లు కొనుగోలు కేంద్రం చేపట్టాలని ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదించి పంపించనున్నట్లు వారు పేర్కొన్నారు.
పరిగి మండలంలో..
యాసంగిలో రైతులు పండించిన వడ్లు కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ఆదివారం డిమాండ్ చేశారు. తమ గ్రామంలో పండించిన వడ్లు కేంద్రం కొనుగోలు చేయాలని రంగంపల్లి గ్రామస్తులు తీర్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. వడ్ల కొనుగోలుపై దేశమంతా ఒకే విధానం అవలంబించాలని డిమాండ్ చేశారు. పంజాబ్‌లో ఒకలా, తెలంగాణలో మరోలా ప్రవర్తించడం కేంద్ర ప్రభుత్వానికి తగదన్నారు. వడ్లు కొనుగోలు చేయాలని రాష్ట్ర మంత్రులు, ఎంపీలు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలువగా వడ్లు కొనుగోలు చేయబోమని పేర్కొనడంతోపాటు తెలంగాణ ప్రజలను అవమానించేలా మీ ప్రజలతో నూకలు తినిపించండంటూ అవహేళనగా మాట్లాడడం సరికాదన్నారు. రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు కూడా ఎక్కువ కాలం నిలువలేదని తెలిపారు. బీజేపీకి అదే గతి పడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతుల కష్టాలను గమనించి వెంటనే యాసంగి వడ్లను ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేసేలా చూడాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అరవిందరావు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, సీనియర్ నాయకుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, నార్మాక్స్ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి, ఉపసర్పంచ్ వెంకటమ్మ, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కొడంగల్ మండలంలో..
కొడంగల్, మార్చి 27 : కేంద్ర ప్రభుత్వం వైఖరిని మార్చుకొని తెలంగాణలో యాసంగిలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనని పీఏసీఎస్ అధ్యక్షుడు శివకుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం పీఏసీఎస్ కార్యాలయంలో చైర్మన్ ఆధ్వర్యంలో పీఏసీఎస్ డైరెక్టర్లు, రైతులు కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనాల్సిందేనని తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటుందనే అక్కసుతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో రైతులకు సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టి వ్యవసాయాన్ని పండుగలా చేసి రైతు అభ్యున్నతికి బాటలు వేసినట్లు తెలిపారు. తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయకపోయినా.. అధిక మొత్తంలో పంటసాగు చేపట్టి దేశానికి తలమానికంగా మారినట్లు పేర్కొన్నారు. పంజాబ్ రాష్ట్రంలో పండించిన పంటలను కేంద్రం కొనుగోలు చేస్తున్నది, కానీ తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని చెప్పడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక న్యాయం.. ఇతర రాష్ర్టాలకు ఒక న్యాయం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నదన్నారు. ధాన్యం కొనుగోలుపై స్పష్టత వచ్చే వరకు ఉద్యమం ఆగదని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని వీడి ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రమేశ్‌రెడ్డి, సర్పంచ్‌లు అంజద్, సావిత్రమ్మ, గోవింద్‌నాయక్, రాజూనాయక్ పాల్గొన్నారు.
బొంరాస్‌పేట మండలంలో..
బొంరాస్‌పేట, మార్చి 27 : యాసంగిలో రైతులు సాగు చేసిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆదివారం మండల సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఎంపీపీ హేమీబాయి అధ్యక్షతన ఎంపీటీసీలు సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చౌహాన్ అరుణాదేశు, వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు యాదగిరి, రైతులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు తీర్మానాన్ని ప్రధానికి పంపిస్తామని ఎంపీపీ తెలిపారు.
ఇబ్రహీంపట్నం మండలంలో..
ఇబ్రహీంపట్నం, మార్చి 27 : కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా రాష్ట్రంలో రెండు సీజన్ల వడ్లు కొనాల్సిందేనని ఇబ్రహీంపట్నం మండల ప్రజాపరిషత్‌లో ఎంపీపీ కృపేశ్ అధ్యక్షతన ఏకగ్రీవ తీర్మానం చేశారు. తీర్మాన కాపీలను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి అందజేశారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి గోయల్‌కు రిజిస్టర్ పోస్టులు, స్పీడ్ పోస్టులు, కొరియర్ ద్వారా పంపించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు భరత్‌రెడ్డి, ఎంపీటీసీలు శ్రీశైలం, నాగమణి, జ్యోతి, మంగ పాల్గొన్నారు.
నందిగామ మండలంలో..
నందిగామ, మార్చి 2 : తెలంగాణ రాష్ట్రంలో పండిన ప్రతి ధాన్యం గింజనూ కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ డిమాండ్ చేశారు. ఆదివారం నందిగామలోని రైతు వేదికలో రైతు బంధు సమితి మండల సమావేశం నిర్వహించి తీర్మానం చేశారు. రాష్ట్ర రైతాంగం పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతున్నదని.. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు తగిన విధంగా గుణపాఠం చెపుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి కో ఆర్డినేటర్లు, సభ్యులు శ్రవణ్, మురళి, రాజు, యాదయ్య పాల్గొన్నారు.