కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తెలంగాణ ప్రజలను అవమానిస్తూ మాట్లాడడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తప్పును ఒప్పుకొని తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని ఉమ్మడి జిల్లా మేధావులు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఇలా వివక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. రైతులతో పెట్టుకున్న బీజేపీకి ఇక నూకలు చెల్లినట్లేనని, త్వరలోనే గుణపాఠం తప్పదన్నారు. అన్నదాత సంక్షేమం కోరి వడ్లను కొనాల్సిన కేంద్రం కావాలనే పక్షపాత ధోరణిని అవలంబిస్తున్నదన్నారు. పంజాబ్‌లో రెండు పంటల ధాన్యం కొనుగోలు చేస్తున్న మోదీ సర్కార్.. తెలంగాణలో ఎందుకు కొనడం లేదని, పంజాబ్‌కో న్యాయం.. మాకో న్యాయమా అంటూ నిలదీశారు. ఏదేమైనా వందశాతం ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని లేకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. బీజేపీ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రజలు తిప్పికొట్టాలని పలువురు మేధావులు, ప్రజా సంఘాల నేతలు పిలుపునిచ్చారు.
రంగారెడ్డి జిల్లాలో..
రంగారెడ్డి, మార్చి 26, (నమస్తే తెలంగాణ) : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై జిల్లా రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించడం అలవాటు చేయాలన్న పీయూష్ గోయల్ వ్యాఖ్యలను తప్పుపడుతూ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని జిల్లా రైతు సంఘం నాయకులు, రైతులు డిమాండ్ చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం కనీవినీ ఎరుగని అభివృద్ధి జరిగిందని, నూకలు తినే పరిస్థితి నుంచి ఇతర రాష్ర్టాలకు బియ్యాన్ని ఎగుమతి చేసే స్థాయికి రైతులు ఎదిగారన్నారు. అంతేకాకుండా నూకలు తినిపించడం అలవాటు చేయాలన్న బీజేపీ నేతలకు నూకలు చెల్లినట్లేనన్నారు. అదేవిధంగా రైతులు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం రైతుల సంక్షేమం కోసం చాలా పథకాలను అమలు చేస్తుందని, అప్పుల బారి నుంచి రక్షించడంతోపాటు పంట పెట్టుబడి నిమిత్తం ఎకరాకు రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం, రైతు ఏ కారణంగా మృతి చెందినా రైతుబీమా పథకంలో భాగంగా రూ.5 లక్షల సాయం, వ్యవసాయానికి 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తు, ఇప్పటికే రూ.లక్ష పంట రుణాల మాఫీ పూర్తి చేసి, మరోసారి రూ.లక్షలోపు పంట రుణాల మాఫీలో భాగంగా ఇప్పటివరకు రూ.50 వేలలోపు రుణమాఫీ పూర్తికాగా, త్వరలో రూ.75 వేలలోపు రుణాలను మాఫీ చేయనున్నారన్నారు. అంతేకాకుండా వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ తీసుకుంటున్న కార్యక్రమాలతో సాగు కూడా పెరిగింది. అయితే కేంద్రం మాత్రం రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేసేందుకు కిరికిరి చేయడం సరైంది కాదంటున్నారు జిల్లా రైతాంగం.
వికారాబాద్ జిల్లాలో..
పరిగి, మార్చి 26 : తెలంగాణలో వ్యవసాయం బాగుపడుతుంటే సహకరించాల్సిన బాధ్యత గల కేంద్ర ప్రభుత్వంలోని ఓ మంత్రి అవహేళనగా మాట్లాడడం సరైంది కాదని రైతాంగం కన్నెర్ర చేస్తున్నది. దేశంలోని ఏ రాష్ట్రంలో వడ్లు పండించినా కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సేకరణ చేపడతారు. దేశంలోని ఇతర రాష్ర్టాల్లో ఒక విధంగా, తెలంగాణలో మరోలా ధాన్యం కొనుగోలు విధానం అమలు సరికాదంటున్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్ద పీట వేస్తున్నది. ఇందులో భాగంగా ప్రభుత్వం మొదట ఎకరాకు రెండు పంటలకు కలిపి రూ.8వేలు పెట్టుబడి సాయం అందించగా ప్రస్తుతం రూ.10వేలు అందజేస్తున్నది. ఈ లెక్కన 8 విడుతల్లో వికారాబాద్ జిల్లాలోని రైతాంగానికి రైతుబంధు కింద రూ.2,271కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇంత పెద్ద మొత్తంలో రైతులకు సాయం అందించిన సర్కారు ఇప్పటి వరకు ఏది లేదని చెప్పవచ్చు. రైతులకు వ్యవసాయ శాఖ సేవలు మరింత చేరువ చేసేందుకు ప్రతి 5వేల ఎకరాలకు ఒక క్లస్టరు ఏర్పాటు చేసి వ్యవసాయ విస్తరణాధికారిని నియమించారు. ప్రభుత్వ తోడ్పాటుతోపాటు 24 గంటల కరెంటు ఉచితంగా అందజేయడం వల్ల వికారాబాద్ జిల్లా పరిధిలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతూ పోతుంది. 2017 సంవత్సరంలో కేవలం 11వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా గత సీజన్లో లక్షా 30వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది.
వరి సాగు విస్తీర్ణం, దిగుబడులు పెరిగాయనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. ఇలాంటి పరిస్థితిలో రైతులను ఆదుకోవడంలో వేడినీళ్లకు చన్నీళ్లు తోడైనట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తూ రైతాంగం పండించిన వరి ధాన్యం కొనుగోలు చేపట్టాల్సి ఉండగా కొనుగోళ్లపై కిరికిరి రాజకీయాలు చేయడం, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అవమానకరంగా మాట్లాడడం సరికాదని రైతాంగం మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు బడా పెత్తందారులకు అనుకూలంగా ఉన్నాయి తప్ప రైతాంగానికి కాదంటున్నారు. యాసంగి సీజన్లో పండించిన వరి ధాన్యం నూకలు కారాదంటే బాయిల్డ్ రైస్ చేయాల్సిందేనని అలాంటిది ముడి బియ్యమే కొంటామంటూ కొర్రీలు పెట్టడం సరికాదని పేర్కొంటున్నారు. మీ రాష్ట్రంలో ప్రజలను నూకలు తినిపించండంటూ వ్యాఖ్యానించడం రైతాంగాన్ని అవమానించడమేనని, వెంటనే కేంద్ర మంత్రి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందేనని వారు పేర్కొంటున్నారు. కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను రైతులు, రైతు సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు.
ధాన్యం సేకరించే వరకు పోరాటం ఆగదు
పూర్తిస్థాయిలో ధాన్యం సేకరించేవరకు పోరాటం ఆగదు. రైతులకు కేంద్రం అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ క్షమాపణ చెప్పాలి.
– మధుసూదన్‌రావు, రైతు సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు, మల్లాపూర్, కొత్తూరు మండలం
వడ్లు కేంద్ర ప్రభుత్వమే కొనాలి..
యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందే. ధాన్యాన్ని కొనుగోలు చేయక కొర్రీలు పెట్టడం సరికాదు. మున్ముందు బీజీపీకి తగిన బుద్ధి చెబుతాం. పనికిమాలిన మాటలను వెనక్కి తీసుకోవాలి.
– బృంగి శ్రీశైలం, కులకచర్ల
వరి ధాన్యాన్ని కొనాలి..
కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనాల్సిందే. రైతులతో పెట్టుకుంటే పుట్టగతులుండవు. రైతుల తరఫున పోరాడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు.
– ఆకుల బసవరాజ్, సేంద్రయ వ్యవసాయ రైతు, యాలాల
కేంద్ర ప్రభుత్వం వైఖరిని మార్చుకోవాలి..
వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని మార్చుకోవాలి. పంజాబ్, హర్యానాలకు ఒక విధానం తెలంగాణకు ఒక విధానం ఇదేం విధానం.
– కటకం శివకుమార్, పీఏసీఎస్ అధ్యక్షుడు, కొడంగల్
పక్షపాతం పనికిరాదు
కేంద్ర మంత్రి తెలంగాణ రైతుల విషయంలో అంత చులకనగా మాట్లాడడం సరికాదు. వేరే రాష్ర్టాల వడ్లు కొనుడెట్లా.. తెలంగాణ వడ్డు కొనకపోవుడెట్లా.. ఇంత పక్షపాతం పనికిరాదు.
– బీ రాములు నాయక్, ఎర్రగోవింద్ తండా కులకచర్ల
మంత్రి వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం..
కేంద్ర మంత్రి వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం. తెలంగాణలోని ప్రజలు నూకలు తినాలని మాట్లాడటం సరికాదు. అన్నం పెట్టే రైతన్నలను గోస పెడుతున్న బీజేపీ సర్కారు బాగుపడదు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి.
– భాస్కర్‌రెడ్డి, కడ్తాల్ మండలం
కేంద్రం చెప్పేదొకటి.. చేసేదొకటి..
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం చెప్పేదొకటి.. చేసేదొకటి.. ఇలాంటి ద్వంద్వ వైఖరి సరికాదు. ధాన్యం కొనుగోలు చేయకుండా అవమానకరంగా మాట్లాడుతారా ? రైతులు తలచుకుంటే పాతాళానికి పోతారు జాగ్రత్త.
– శ్రీనివాస్‌రెడ్డి, ఇర్విన్, రైతు సంఘం నాయకుడు
తెలంగాణ రైతులంటే ఇంత చులకనా..
తెలంగాణ రైతులంటే కేంద్రానికి ఇంత చులకనా. పంజాబ్‌లో రెండు పంటల వడ్లను కొంటోంది. తెలంగాణలో మాత్రం వడ్లను కొనం అని కేంద్ర మంత్రి చెప్పడం చాలా బాధకరం. బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు.
– ఎడ్మ పాపిరెడ్డి, రైతు, కేశంపేట
రైతులకు ఇబ్బందులు కలిగిస్తే ఊరుకోం..
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్న బీజేపీ సర్కారుకు తగిన గుణపాఠం తప్పదు.
– జోగు శ్రీనివాస్, కిష్టాపూర్, యాలాల
కేంద్ర మంత్రి క్షమాపణ చెప్పాలి..
రైతులను చులకన చేసి మాట్లాడిన కేంద్ర మంత్రి క్షమాపణ చెప్పాలి. సీఎం కేసీఆర్ నేతృత్వంలో వ్యవసాయం పండుగలా సాగుతున్నది.
– కొలన్ ప్రభాకర్‌రెడ్డి, జిల్లా రైతుబంధు సమితి సభ్యుడు(షాబాద్)
రైతులను ఇబ్బందులు పెట్టొద్దు..
ఆరుగాలం కష్టపడే రైతులను కేంద్రం ఇబ్బందులు పెట్టొద్దు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 24 గంటల కరెంట్‌తో పుష్కలంగా పంటలు పండుతున్నాయి. రైతులను అవమానపచడం మంచిది కాదు.
– పి. పోచయ్య, రైతు కుమ్మరిగూడ(షాబాద్)
అన్ని రాష్ర్టాలను ఒకే దృష్టితో చూడాలి..
కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ర్టాలను ఒకే దృష్టితో చూడాలి. కేంద్ర మంత్రి తెలంగాణ ప్రజలను అవమానించేలా మాట్లాడటం సరికాదు. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయాల్సిందే.
– చంద్రారెడ్డి, శంకర్పల్లి మండలం
వడ్లు కేంద్రమే కొనాలి..
వడ్లను కేంద్రం కొనాల్సిందే. లేదంటే రాబోవు రోజుల్లో బీజేపీకి బుద్ధి చెబుతాం. సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు అందిస్తున్నారు. పండించిన వరిని కొనాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది.
– మాధవ్‌గౌడ్, చేవెళ్ల మండలం
బీజేపీ ప్రభుత్వ వైఖరి సరికాదు..
వడ్ల కొనుగోలులో బీజేపీ ప్రభుత్వ వైఖరి సరికాదు. తెలంగాణపై పక్షపాత ధోరణితో ప్రవర్తిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం.
– నర్సింహగౌడ్, రైతుబంధు సమితి కోఆర్డినేటర్, కొత్తూరు మండలం
కేంద్రం కొర్రీలు పెట్టడం సరికాదు..
వడ్ల కొనుగోలులో కేంద్రం కొర్రీలు పెట్టడం సరికాదు. వడ్లు కొనాలని సీఎం కేసీఆర్ ఏడాది నుంచి కోరుతున్నా కేంద్రం స్పందించక పోవడం దారుణం.
– విష్ణువర్ధన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్, బొంరాస్‌పేట
ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందే..
యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందే. తెలంగాణ రాష్ర్టాన్ని చిన్నచూపు చూడడం తగదు. బీజేపీకి రాబోవు రోజుల్లో తగిన గుణపాఠం తప్పదు.
– చంద్రశేఖర్, విఠ్యాల గ్రామస్తుడు
రైతులకు అన్యాయం చేయొద్దు..
వడ్ల కొనుగోలులో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతులకు అన్యాయం చేయొద్దు. ఆరుగాలం కష్టపడే రైతులను కష్టపెడితే అది కేంద్ర సర్కారుకే నష్టం. కేంద్రమే దిగివచ్చి రైతులకు న్యాయం చేయాలి.
– శంకర్లింగం, కొత్తూరు, బొంరాస్‌పేట
తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి..
అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రులు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. పండించిన ప్రతి గింజను కొనాల్సిందే. లేదంటే బీజేపీకి బుద్ధి చెబుతాం. నూకలు తిని బతకండి మాట్లాడటం సరికాదు.
– మంచిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, (ఇబ్రహీంపట్నం)
ప్రతి గింజనూ కొనుగోలు చేయాలి..
పండిన ప్రతి గింజనూ కేంద్రం కొనుగోలు చేయాల్సిందే. సీఎం కేసీఆర్ రైతుల శ్రేయస్సు కోసం కృషి చేస్తుంటే.. బీజేపీ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచడం సరికాదు.
– వంగేటి లక్ష్మారెడ్డి, రైతుబంధు సమితి జల్లా అధ్యక్షుడు (ఇబ్రహీంపట్నం)
నూకలు తినాల్సిన అవసరం లేదు..
కేంద్ర మంత్రి నూకలు తినండి అంటూ మాట్లాడటం సరైన పద్ధతికాదు. మాకు ఆ అవసరం లేదు. పుష్కలంగా వడ్లు పండించుకుంటున్నాం. వడ్లు కొనలేక పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు.
– మొద్దు బాల్‌రెడ్డి, (ఇబ్రహీంపట్నం)