ఈ రోజు మన దోస్త్ కుమారుడి బర్త్డేనంట స్టేటస్‌లో పెట్టిండు.. అయ్యో.. మన స్కూల్ దోస్త్ బిడ్డకు ఆరోగ్యం బాగాలేదంట ఎవరైనా సాయం చేయాలని స్టేటస్‌లో కోరాడు. మాజీ సర్పంచ్ మరణించిందంట పక్క గ్రామానికి చెందిన ఓ పిల్లోడు స్టేటస్‌లో పెట్టిండు.. రేపు జాబ్ మేళా ఉన్నదని మా సార్ స్టేటస్‌లో వివరాలను పెట్టారు.. పండుగ ఏదైనా.. సంబురం ఎప్పుడొచ్చినా.. సందర్భం ఎక్కడైనా..విషాదం చోటుచేసుకున్నా.. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్‌మీడియా వేదికల్లో స్టేటస్‌గా పెట్టుకోవడం మరింత ట్రెండీగా మారుతున్నది. లక్కీ లాటరీ తగిలినా, పిల్లల పుట్టినరోజులు జరుపుకొన్నా, ఏదైనా విషాదం చోటుచేసుకున్నా.. ఇలా ప్రతి అంశం ప్రస్తుతం సోషల్‌మీడియాలో స్టేటస్‌లుగా దర్శనమిస్తున్నాయి. ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉంటుండటంతో స్టేటస్లు చూసేవారి సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది.
చాలామంది తమ ఇంట్లో, కుటుంబంలో జరిగిన సంతోషాన్ని నలుగురితో పంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. సోషల్‌మీడియా వేదికగా స్టేటస్ రూపంలో అందరితో చెప్పుకొనేందుకు ఆరాటపడుతున్నారు. పిల్లల పుట్టినరోజులు, వేడుకలకు సంబంధించిన ఫొటోలను స్టేటస్‌లుగా పెడుతున్నారు. గృహ ప్రవేశాలు, పెండ్లి రోజు వేడుకల ఫొటోలను పంచుకుంటున్నారు. ఏ పండుగ వచ్చినా.. పండుగకు దగ్గట్టు పిల్లలకు డ్రెస్సింగ్ చేయడం, నెలనెలా పుట్టినరోజు వేడుకలను వినూత్నంగా నిర్వహిస్తూ తమ సంతోషాలను స్టేటస్‌లుగా పెడుతున్నారు. స్టేటస్‌లను చూసి స్పందించేవారిని.. ఆత్మీయంగా పలకరించేందుకు ఆరాటపడుతున్నారు. వారితో సంబంధాలను మరింత బలపర్చుకునేందుకు ముందుకువస్తున్నారు.
సమాచారం అందిస్తూ..
ప్రస్తుతం సమాచారం చేరవేతలో స్టేటస్లు కీలకంగా మారుతున్నాయి. నలుగురికి ఉపయోగపడే ఏ సమాచారమైనా స్టేటస్‌లుగా పెడుతున్నారు. జాబ్‌మేళాల వివరాలు, వివిధ పోటీ పరీక్షల సమాచారం, వివిధ పాఠశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన సమాచారాన్ని చాలామంది స్టేటస్లల్లో పొందుపరుస్తున్నారు. ఈ సమాచారం ఎంతోమందికి ఉపయోగకరంగా మారుతున్నది. రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారు.. ప్రధానంగా ప్రభుత్వానికి సంబంధించిన కీలక విషయాలపై, ప్రభుత్వ పథకాలపై సోషల్‌మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఉచిత శిక్షణలు, సదస్సులు, విద్యార్థి సమావేశాలు, అవగాహన తరగతులు తదితర వివరాలను స్టేటస్‌లుగా పెట్టుకుంటున్నారు. సర్కారు ఇచ్చిన నోటిఫికేషన్లు, వివిధ సంస్థలు ఇస్తున్న శిక్షణలు, ఎవరు అర్హులు, దరఖాస్తులు ఎలా చేసుకోవాలి, ఎలాంటి శిక్షణ ఇవ్వనున్నా రు తదితర వాటిని తాజాగా చాలామంది సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధుల వాట్సాప్ స్టేటస్లల్లో దర్శనమిస్తున్నాయి. పోలీసులు ఇస్తున్న పిలుపులు, ప్రజలు పాటించాల్సిన నియమనిబంధనల గురించి అవగాహన కల్పనలోనూ ఇవే కీలకంగా మారా యి. మరోవైపు, ఆపదలో ఉన్న తమ పిల్లలను ఆదుకోవాలంటూ పలువురు ఆపన్నులు చేస్తున్న విజ్ఞప్తులకు ఇవే వేదికవుతున్నాయి. వీటిని చూసి స్పందించేవారూ తక్కువేం లేరు. ఆదుకునేందుకు ముందుకొస్తున్నవారికీ కొదవలేదు.
నేతలకు ప్రధాన ప్రచారాస్త్రం
రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులకు సోషల్‌మీడియా ప్రధానాస్త్రంగా మారింది. కార్యక్రమం ఏదైనా వెనువెంటనే కార్యకర్తలందరికీ తెలిసేందుకు స్టేటస్‌లను అస్త్రంగా వినియోగిస్తున్నారు. నేడు జరిగిన కార్యక్రమాలు, రేపు జరిగే సమావేశాలపై సమాచారం ఇచ్చేందుకు వీటినే వేదికగా చేసుకుంటున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలకూ ఇవే వేదికవుతున్నాయి.
పన్నులు.. చెల్లింపు తేదీలు
ప్రస్తుతం వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు.. ఆయా విభాగాలకు సంబంధించిన సమాచారాన్ని స్టేటస్‌లలో పెడుతున్నారు. పన్నుల వసూళ్లు, ప్రత్యేక రాయితీలు, వివిధ పన్నుల చెల్లింపునకు చివరి తేదీలను పెడుతూ అవగాహన కల్పిస్తున్నారు. ఇవి పుర ప్రజలకు ఉపయోగపడుతున్నాయని పలువురు సిబ్బంది పేర్కొంటున్నారు. ఆయా శాఖలకు వచ్చిన గుర్తింపులను, సాధించిన విజయాలను కూడా స్టేటస్‌లుగా
నలుగురికి మేలు జరిగితే చాలు
తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు అవసరమైన ప్రతి సమాచారాన్ని స్టేటస్‌ల రూపం లో పెడుతుంటాం. మా బృందం కూడా నలుగురికి ఉపయోగపడే పనిలో ఎల్లప్పుడూ ముందుం టుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేష న్లు జారీ చేస్తామని చెప్పడంతో ఎంకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎప్పటిలాగే నిరుద్యోగ యువతీయువకులకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశాం. దీనివల్ల కొంతమందికి ఉద్యోగాలు వచ్చి నా.. మా కల నెరవేరినట్లు. నలుగురికి మేలు కలిగే పనిచేయడం కంటే జీవితంలో ఇంకేం కావాలి.
– మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు
విద్యార్థులకు ఉపయోగపడాలని..
ప్రభుత్వం నుంచి వెలువడే జీవోలు, గురుకులాలు, మోడల్ స్కూళ్లు, ఇతర వసతిగృహాల్లో ప్రవేశాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని వాట్సాప్, ఇతర సోషల్‌మీడియా వేదికగా స్టేటస్‌లుగా పెడుతు న్నా. వాటిని చూసి ఎంతోమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆరా తీస్తున్నారు. మరింత సమాచారం కోసం అవసరమైతే ఫోన్లు కూడా చేస్తున్నారు. ఆ సమాచారం నలుగురికి ఉపయోగపడినా అంతకంటే ఇంకేం కావాలి. అందుకే విద్యార్థులకు అవసరమయ్యే ప్రతి సమాచారాన్ని స్టేటస్‌లో పెడుతున్నా. నా ఫోన్లో వెయ్యికిపైగా కాంటాక్ట్‌లు ఉంటాయి.
– జ్వాల బాలనర్సింహ, మీ సేవ నిర్వాహకుడు, తట్టిఅన్నారం, పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ