మొయినాబాద్, మార్చి 21 : విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని అటవీ శాఖ రంగారెడ్డి జిల్లా చీఫ్ కన్జర్వేటర్ సునీతాభగవత్ అన్నారు. మండల పరిధిలోని చిలుకూరు రెవెన్యూలో ఉన్న జాతీయ మృగవని పార్కులో సోమవారం ప్రపంచ అటవీ దినోత్సవ కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా అటవీ శాఖ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. అటవీ దినోత్సవం సందర్భంగా వినూత్న రీతిలో కార్యక్రమాలు నిర్వహించారు. మండల పరిధిలోని అజీజ్‌నగర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులను ఆహ్వానించి పర్యావరణం, ప్రకృతితో పాటు జాతీయ మృగవని పార్కులో ఉన్న జీవరాశులు, జీవవైవిధ్యం గురించి అవగాహన కల్పించారు.
పార్కులో ఉన్న అడవులు, జంతువులు, ప్రకృతి ఫొటోలు పెయింటింగ్‌తో కూడిన ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను విద్యార్థులకు ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవాళి అవసరాల నిమిత్తం అడవులు నరికివేతకు గురవుతున్నాయన్నారు. కావున, విరివిగా మొక్కలను నాటి అడవులను పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దీంతో పర్యావరణాన్ని సంరక్షించవచ్చన్నారు. కార్యక్రమంలో అటవీ శాఖ జిల్లా అధికారి జానకీరామ్, అధికారులు విజయనంద్, మక్సుద్, సిబ్బంది పాల్గొన్నారు.