సీఎం కేసీఆర్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. మంగళవారం అసెంబ్లీ వేదికగా వరాల జల్లు కురిపించారు. ఇప్పటికే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించగా.. మరింత మంది ఉద్యోగులకు మేలు చేసే దిశగా ప్రకటనలు చేశారు. సెర్ప్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనం ఇస్తామని, ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని, వీఆర్ఏలను ఇరిగేషన్ శాఖలోకి తీసుకుంటామని, మధ్యాహ్న భోజన కార్మికుల పారితోషికం రూ.1000 నుంచి రూ.3వేలకు పెంచుతామని, ఉక్రెయిన్ నుంచి వచ్చిన తెలుగు విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ నిర్ణయంపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్నది. రోడ్డున పడిన తమ కుటుంబాలకు మళ్లీ భరోసా లభించిందని ఫీల్డ్ అసిస్టెంట్లు, వేతనాల పెంపుతో తమ కష్టానికి తగిన ఫలితం లభించనున్నదని సెర్ప్, మెప్మా ఉద్యోగులు, మధ్యాహ్న భోజన కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన తమ పిల్లల చదువులు అర్ధాంతరంగా నిలిచిపోతాయేమోనని ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులకు సీఎం కేసీఆర్ ప్రకటన ఎంతో ఊరటనిస్తున్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. -షాబాద్, మార్చి 15
పరిగి, మార్చి 15 : అసెంబ్లీ సమావేశాల చివరి రోజు సీఎం కేసీఆర్ పలు వర్గాలకు తీపికబురు అందించారు. చిరుద్యోగులకు ప్రయోజనం చేకూరే అనేక అంశాలను ప్రకటించారు. గతంలో వద్దంటే సమ్మెలోకి వెళ్లిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించగా, తిరిగి వారందరినీ విధుల్లోకి తీసుకుంటామన్నారు. సెర్ప్, మెప్మా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందజేస్తామన్నారు. వీఆర్ఏలను నీటి పారుదల శాఖలో నియమిస్తామని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు వెయ్యి రూపాయలు పారితోషికంగా అందజేస్తుండగా రూ.3వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. దీంతోపాటు ఉక్రెయిన్‌లో వైద్య విద్య చదువుతూ యుద్ధం కారణంగా స్వదేశానికి తిరిగి వచ్చిన రాష్ట్ర విద్యార్థులకు ప్రభుత్వ ఖర్చులతోనే వైద్య విద్య అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు. సీఎం కేసీఆర్ ప్రకటనతో ప్రయోజనం చేకూరే వర్గాల కుటుంబాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి.
విధుల్లోకి 370 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు..
సీఎం కేసీఆర్ ప్రకటనతో వికారాబాద్ జిల్లా పరిధిలో 370 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోనున్నారు. సమ్మెలోకి వెళ్లడంతో 2020 మార్చిలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించారు. ఇకపై మళ్లీ ఆ తప్పు చేయమని చెప్పడంతో వారిని విధుల్లోకి తీసుకుంటున్నట్లు సీఎం ప్రకటించారు. దీంతో వారి కుటుంబాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
సెర్ప్, మెప్మా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు
సెర్ప్, మెప్మా ఉద్యోగులకు సైతం సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. సెర్ప్, మెప్మాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందిస్తామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. మహిళా సంఘాలను చైతన్యం చేసేందుకు, ఆర్గనైజింగ్ కెపాసిటీ పెంచేందుకు వారు విశేష కృషి చేస్తున్నారని అభినందించారు. అందువల్ల వారు ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని ప్రకటించారు. తద్వారా వికారాబాద్ జిల్లా పరిధిలో సెర్ప్ ఉద్యోగులు 185 మందికి వేతనాలు పెరగనున్నాయి. సెర్ప్‌లో పని చేస్తున్న సీసీలు, ఏపీఎంలు, డీపీఎంలు, ఏపీడీలకు వేతనాలు పెరుగుతాయి. వీరితోపాటు మెప్మాలో పనిచేస్తున్న 11 మంది ఉద్యోగుల వేతనాలు సైతం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇవ్వడం జరుగుతుంది. సీఎం కేసీఆర్ ప్రకటనతో వారి కుటుంబాల్లో సంతోషం వెల్లి విరుస్తున్నది.
ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులను చదివిస్తాం..
ఉక్రెయిన్‌లో వైద్య విద్య అభ్యసించేందుకు వెళ్లి యుద్ధం వల్ల స్వదేశానికి వచ్చిన తెలంగాణ విద్యార్థులకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరించి వారిని చదివిస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 700 పైచిలుకు మంది విద్యార్థులున్నారని, వారందరినీ తెలంగాణ ప్రభుత్వమే చదివిస్తుందని తెలిపారు. ఇదే విషయమై కేంద్రానికి లేఖ రాయనున్నట్లు సీఎం పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటనతో జిల్లాకు చెందిన ఉక్రెయిన్‌లో వైద్య విద్య కోసం వెళ్లి వచ్చిన వారి కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతున్నది.
ఇరిగేషన్ శాఖలోకి వీఆర్ఏలు..
వీఆర్ఏలను ఇరిగేషన్ శాఖలోకి సర్దుబాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. వికారాబాద్ జిల్లా పరిధిలో వీఆర్ఏ పోస్టులు 989 ఉండగా ప్రస్తుతం 825 మంది పని చేస్తున్నారు. వీఆర్ఏలకు స్కేల్ ఇచ్చి ఇరిగేషన్ శాఖలో లష్కర్ పోస్టులోకి తీసుకుంటామని సీఎం ప్రకటించారు. కాల్వల నిర్వహణ కోసం లష్కర్లు పని చేస్తారు. తద్వారా వీఆర్ఏలకు వేతనాలు పెరగడంతోపాటు ఇరిగేషన్ శాఖలో పని చేసేందుకు అవసరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నది.
మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.3వేలు
మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనాలు సైతం పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. చిరుద్యోగుల వేతనాలు పెంచిన సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనాలు పెంచాలని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కోరారు. వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్ మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చే గౌరవ వేతనాన్ని వెయ్యి రూపాయల నుంచి రూ.3వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లాలో 1671 మంది మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో వారందరికీ ప్రయోజనం చేకూరనున్నది.
మళ్లీ విధుల్లోకి తీసుకోవడం సంతోషకరం..
ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకోవడం చాలా సంతోషకరం. వందలాది మంది ఫీల్డ్ అసిస్టెంట్లు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటారు. ఎలాంటి సమ్మెలకు పోకుండా తమ పని తాము చేసుకుంటే మంచిది. తెలంగాణలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతున్నది.
– వీరేశం, ఎల్మకన్నె, తాండూరు
జీవితాల్లో వెలుగులు నిండాయి..
ఫీల్డ్ అసిస్టెంట్ల జీవితాల్లో మళ్లీ వెలుగులు నిండాయి. ఉద్యోగం కోల్పోయి రోడ్డుపాలయ్యారు. అందరి కష్టాలను అర్థం చేసుకునే సీఎం మనకు ఉండడం అదృష్టం. ఇకపై చక్కగా పని చేసుకుంటూ ముందుకు సాగుతాం.
– సాయి ప్రణీత్, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం , మండల అధ్యక్షుడు (వీరారెడ్డిపల్లి), తాండూరు
చాలా సంతోషంగా ఉన్నది..
సెర్ప్, ఐకేపీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడం చాలా సంతోషంగా ఉన్నది. చాలీచాలని వేతనాలతో గడుపుతున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు సంక్షేమ పథకాల అమలులో సహకారాన్ని అందిస్తున్నాం.
– ఆనందమ్మ, మెప్మా ఉద్యోగి, కొడంగల్
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం..
ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకొంటామని ప్రకటన చేసిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. రెండు ఏండ్లుగా విధులకు దూరంగా ఉండి గడ్డు జీవితాన్ని గుడుపుతున్నాం. మా బాధలను అర్థం చేసుకున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– భీమప్ప, ఫీల్డ్ అసిస్టెంట్, రావులపల్లి
వేతనం పెంచినందుకు సంతోషంగా ఉన్నది..
మున్సిపల్లో హెచ్ఆర్గా పని చేస్తున్నా. మా ఇబ్బందులను గుర్తించి వేతనాలు పెంచినందుకు సంతోషంగా ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెంచిన సీఎం కేసీఆర్‌కు జీవితమంతా రుణపడి ఉంటాం.
– వెంకటేశం, వికారాబాద్ మెప్మా ,టౌన్ మిషన్ కో ఆర్డినేటర్
సర్కారు నౌకర్లతో సమానంగా..
వికారాబాద్ మండల మహిళా సమాఖ్యలో కొన్ని ఏండ్లుగా పని చేస్తున్నా. సర్కారు నౌకర్లతో సమానంగా వేతనం ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం చాలా సంతోషంగా ఉన్నది. అందరి బాధలను అర్థం చేసుకునే గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్.
– లక్ష్మయ్య, ఏపీఎం మండల , మహిళా సమాఖ్య వికారాబాద్
నీటి పారుదల శాఖలోకి మారుస్తున్నందుకు ఆనందంగా ఉన్నది..
రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తున్న వీఆర్వోలను నీటి పారుదల శాఖలోకి మార్చుతున్నందుకు సంతోషంగా ఉన్నది. వేతనం పెరుగుతున్నందుకూ ఆనందంగా ఉన్నది. మా కష్టాన్ని అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– వర్ధన్, వీఆర్వో, తాండూరు
సీఎం ప్రకటనతో కష్టాలు తీరాయి..
మధ్యాహ్న భోజన కార్మికులకు గౌరవ వేతనం పెంచుతామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించడంపై పీఆర్టీయూ తెలంగాణ రంగారెడ్డి జిల్లాశాఖ హర్షం వ్యక్తం చేస్తున్నది. ఎన్నో ఏండ్లుగా చాలీచాలని జీతంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– సత్తారి రాజిరెడ్డి, పీఆర్టీయూ తెలంగాణ రంగారెడ్డి జిల్లాశాఖ ప్రధాన కార్యదర్శి
ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం..
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సెర్ప్ ఉద్యోగులకు కూడా వేతనాలు ఇస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడం హర్షణీయం. గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు మా సెర్ప్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పడం సంతోషంగా ఉంది.
– నర్సింహులు, సెర్ప్ ఉద్యోగి, షాబాద్
ఉద్యోగులకు మేలు జరుగుతున్నది..
గ్రామాల్లో సెర్ప్ ఉద్యోగులు చేస్తున్న సేవలను గుర్తించిన ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు వేతనాలు పెంచుతామని ప్రకటించడం మంచి నిర్ణయం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎంతోమంది ఉద్యోగులకు మేలు జరుగనున్నది. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
– మల్లేశ్, సెర్ప్, సీసీ షాబాద్
మళ్లీ విధుల్లోకి తీసుకోవడం సంతోషకరం..
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించడం సంతోషంగా ఉన్నది. రెండు ఏండ్లుగా ఖాళీగా ఉంటున్నాం. మా కష్టాలను గుర్తించి మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– అంజయ్య, ఫీల్డ్ అసిస్టెంట్, షాబాద్ మండలం
సర్కార్ నిర్ణయం బాగుంది..
ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఎంతో బాగుంది. రెండేండ్లుగా విధులకు దూరంగా ఉంటున్నాం. సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు..
– రాజు, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం,జిల్లా ప్రధాన కార్యదర్శి(షాబాద్)
జీతాల పెంపు హర్షణీయం..
మధ్యాహ్న భోజన కార్మికుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా సీఎం కేసీఆర్ ఆలోచించి జీతాలు పెంచడం హర్షణీయం. గతంలో రూ.వెయ్యి ఇస్తే సరిపోయేది కాదు. ఇప్పుడు రూ. 3 వేలు ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
– జ్యోతి, మధ్యాహ్న భోజన కార్మికురాలు, అంతారం(చేవెళ్ల)