కొత్తూరు/కొత్తూరు రూరల్, మార్చి 15: కల్లు దుకాణాలను అడ్డాగా చేసుకుని బంగారు, వెండి ఆభరణాలను ధరించిన ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని కొత్తూరు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి రూ. ఆరు వేల నగదు, మూడు బైకులు, 10 తులాల వెండి, నల్ల పూసల తాడు, బంగారు కమ్మలు, 60 చిన్న బంగారు గుండ్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం కొత్తూ రు ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి వివరాలను వెల్లడించారు.
మండలంలోని ఎస్బీపల్లికి చెందిన భారతమ్మ (35) మార్చి10న మహిళా సంఘంలో డబ్బులను చెల్లించేందుకు మేకగూడకు వెళ్తున్నది. ఈ క్రమంలో కొత్తూరుకు వచ్చి అక్కడి కల్లు దుకాణంలో కల్లు తాగుతున్నది. అక్కడే ఒంటరి మహిళలకోసం మాటువేసి ఉన్న ఫరూఖ్‌నగర్ మండలం, ఎలికట్ట గ్రామానికి చెందిన జక్కుల శివలిం గం, కొందుర్గు మండలంలోని విశ్వనాథపురం గ్రామానికి చెందిన మల్లేశ్ భారతమ్మను గమనించారు. ఆమె దగ్గరకు వెళ్లి పరిచయం చేసుకున్నారు. ఆమెను నమ్మించి ఎస్బీపల్లిలో దింపుతామని చెప్పి చోరీ చేసి నంబర్ ప్లేట్ మార్చి న బైక్‌పై ఎక్కించుకున్నారు. అయితే వారు పెంజర్ల నుంచి మేకగూడ రోడ్డువైపు ఆమెను తీసుకెళ్లారు.
అనుమానం వచ్చిన భారతమ్మ ఎక్కడికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించగా తమ వద్ద మద్యం ఉందని మార్గమధ్యంలో తాగి వెళ్దామని చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ భారతమ్మ చేతులను తాడుతో కట్టేసి కొట్టి.. ఆమె వద్ద ఉ న్న రూ.ఆరు వేల నగదు, 10 తులాల వెండి, బంగారు కమ్మలు, సెల్‌ఫోన్‌ను తీసుకొని పరారయ్యారు. ఈ నెల 11వ తేదీన భారతమ్మ కొత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు దర్యాప్తును ప్రారంభించారు. విచారణలో భాగంగా పోలీసులు పెంజర్ల రోడ్డులోని సీసీ కెమెరాల్లోని ఫుటేజీని పరిశీలించగా నంబర్ ప్లేటు లేని బైక్‌పై మహిళ వెళ్తున్నట్లు గుర్తించారు. ఈ నెల 14 నందిగామలోని కల్లు దుకాణం వద్ద ఆ బైక్‌ను గుర్తించి దుకాణంలోకెళ్లి చూడగా నిందితులు ఉండటంతో వారిని పట్టుకున్నారు. కొత్తూరు పీఎస్‌ను తీసుకొచ్చి విచారించగా నేరం చేసినట్లు వారు అంగీకరించారు.
శివలింగంపై పలు కేసులు
శివలింగంపై పలు కేసులు ఉన్నట్లు డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి వివరించారు. అతడు 2021జూలై నెలలో బెయిల్‌పై వచ్చి డ్రైవింగ్ చేసుకుంటూ జీవిస్తున్నట్లు తెలిపారు. విలాసాల కు డబ్బు సరిపోకపోవడంతో షాద్‌నగర్‌లో మూడు బైకులను చోరీ చేశాడన్నారు. 2022 ఫిబ్రవరిలో పరిగి కల్లు దుకాణం వద్ద ఓ మహిళను భయపెట్టి నల్లపూసల తాడుతోపాటు 60 చిన్న బంగారు గుండ్లను తస్కరించినట్లు చెప్పారు. శివలింగంపై 11 కేసులు ఉన్నాయని, ఇప్పటికే 10 కేసుల్లో విచారణ పూర్తయిందన్నారు. అతడిపై పీడీ యాక్టు నమోదు చేస్తామన్నారు. శివలింగం డ్రైవర్‌గా పనిచేస్తున్న మహేశ్‌ను పరిచయం చేసుకొని కొత్తూరులో పలు చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. కేసును ఛేదించి నిందితులను పట్టుకున్న ఎస్ఐ శంకర్, ఏఎస్ఐ అబ్దుల్లా, కానిస్టేబుళ్లు ఎర్రకుమార్, హరీశ్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డిని డీసీపీ అభినందించి నగదు రివార్డు అందజేశారు. సమావేశంలో షాద్‌నగర్ ఏసీపీ కుషాల్కర్, కొత్తూరు సీఐ బాలరాజు ఉన్నారు.