వేంకటేశ్వర గుట్ట ప్రాధాన్యత
పాండవుల బండ ప్రకృతి అందాలు చూపరులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఎత్తైన కొండలు, జాలువారే సెలయేరు, పక్కనే ఎప్పుడు నిండు కుండలా కనబడుతున్న చెరువు, పచ్చని ప్రకృతి సోయగం కండ్ల సంబురంగా ఉంటుంది. శీతాకాలంలో అడవుల్లోని సీతాఫలాలను తీసుకెళ్లే వారికి ప్రకృతి అందాలతో మైమరిపించే పాండవుల బండ కులకచర్ల మండలంలోని తిర్మలాపూర్ గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మండల కేంద్రానికి సుమారు 6 కి.మీ దూరం ఉంటుంది. పాండవుల గుట్ట ప్రాంతానికి వెళ్తే పచ్చని చెట్లు జాలువారుతున్న జలపాతాలు కనిపిస్తాయి. ఈ ప్రాంతాన్ని పండుగల సాయన్న గుట్టలు అని పిలుస్తారు. ఇక్కడ పండుగల సాయన్న గుండు, గద్ద గుండు, గుండు మీద గుండు, నిండుగా పారుతున్న కుంట చూపరులను ఆనందపరుస్తాయి. ఈ ప్రదేశం చారిత్రాత్మక ప్రదేశాలను తలపిస్తున్నది.
పాండవులగుట్టకు వెళ్లేదారిలో వేంకటేశ్వరస్వామి గుట్ట ఉన్నది. రజాకర్ల హయాంలో గుట్టపైన ఉన్న వేంకటేశ్వరస్వామి గుడిలోని విగ్రహాన్ని ధ్వంసం చేశారని పెద్దలు చెబుతున్నారు. ఇప్పటికీ భక్తులు దర్శించుకొని పూజలు చేస్తుంటారు. ఇక్కడ స్వామివారికి మాంసంతోనే నైవేద్యం పెడుతుంటారు. మేకలను, గొర్రెలను, కోళ్లను బలిచ్చి పూజా కార్యక్రమాలు చేస్తుంటారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు.
పర్యాటక ప్రాంతంగా గుర్తించాలి..
పాండవుల గుట్ట ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి. ప్రకృతి అందాలతో చూపరులు మంత్రముగ్ధులు కావాల్సిందే. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా ప్రభుత్వం గుర్తించాలి.
పాండవులగుట్ట విశేషాలు..
ద్వాపరయుగంలో జూదంలో ఓడిన పాండవులు వనవాసం చేస్తూ ఒక రోజు ఈ గుట్టపై నిద్రించారని పురాణ కథ. అందువల్లే పాండవుల గుట్టగా పేరు వచ్చిందని గ్రామ పెద్దలు చెబుతుంటారు. ఈ ప్రాంతంలో ఓ కొలను ఏర్పాటు చేశారని కథనం.. ఈ నీటి కుంట ఊటనీటిచే ఏర్పడిందని, ఎండాకాలం సైతం కుంట నిండుగా ఉంటుంది. చుట్టు పక్కలపొలాల వారు ఇక్కడికి వచ్చి నీరుతాగి వెళ్తుంటారు. కుంట నీటిచే ఎప్పుడు వరి పంటను పండిస్తుంటారు. బండపై నుంచి జాలువారే నీటిని చూసి ఆనందించాల్సిందే. కులకచర్ల నుంచి తిర్మలాపూర్ మీదుగా అడవివెంకటాపూర్ గ్రామానికి వెళ్లే దారిలోనే పాండవుల గుట్ట ఉన్నది.
పండుగల సాయన్న గుండు విశేషాలు..
రజాకార్ల హయాంలో ధనిక వర్గాలను గడగడ లాడించిన వ్యక్తి పండుగల సాయన్న. ధనికులను దోచి పేదలకు పంచి పెట్టేవాడని చెబుతుంటారు. పాండవులగుట్టపైన ఉన్న గుండు పైనుంచి తన కార్యకలాపాలను కొనసాగించేవాడని, రజాకార్లను గజగజలాడించాడని చెబుతుంటారు. రాత్రివేళల్లో దోచుకోవడానికి వెళ్లే ముందు ఈ గుండుపైన దీపం పెట్టి వెళ్లేవాడని, ఆ దీపం 15 కి.మీ దూరం వరకు కనిపించేదట. దీపం ఆధారంగా తిరిగి గుండుపైకి వచ్చే వాడట. అప్పటి నుంచి ఆ గుండుకు పండుగల సాయన్న గుండుగా పేరు వచ్చింది. సాయన్న దోచుకున్న ధనాన్ని గుట్టల ప్రాంతంలో దాచి పెట్టాడని, ఇప్పటికీ అక్కడక్కడ తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం.
ఎక్కడానికి సాధ్యంకాని గద్ద గుండు..
పైకి వెళ్లడానికి సాధ్యం కాని గద్ద గుండు పాండవుల గుట్ట పైన ఉన్నది. గుండుపైకి ఎక్కాలని ఎంతోమంది ప్రయత్నించి విఫలమయ్యారు. గద్దలు ఈ గుండుపై గుంపులు గుంపులుగా ఉండేవట. గద్ద గుండు నుంచి పోచమ్మదారి కనబడుతుంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, విద్యార్థులు ఇప్పటికీ పాండవుల గుట్టపైకి వచ్చి వనభోజనాలు చేసి వెళ్తుంటారు.