పార్టీ శ్రేణులకు మంత్రులు, ఎమ్మెల్యేలు పిలుపు విజయగర్జనను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని మంత్రులు, ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొనగా.. కొడంగల్ పట్టణంలో జరిగిన నియోజకవర్గ సమావేశానికి విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, తుర్కయాంజాల్‌లో జరిగిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవంబర్ 15న వరంగల్‌లో జరిగే సభను జయప్రదం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం 200 బస్సులు అందుబాటులో ఉంచి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
తుర్కయాంజాల్, అక్టోబర్ 27 : బక్కచిక్కిన రైతుకు రైతు బంధుతో భరోసా కల్పిస్తూ సీఎం కేసీఆర్ ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రైతుకు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ విస్త్రృతస్థాయి సమావేశం బుధవారం తుర్కయాంజాల్‌లోని వేద కన్వెన్షన్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన రెడ్డి ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం పరిధిలోని కొహెడలో ఆసియాలోనే అతి పెద్ద పండ్ల మార్కెట్ నిర్మాణం కాబోతుందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణ పనులను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కేసులు వేయడంతో పనుల్లో జాప్యం జరుగుతున్నదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో 145 మెగావాట్ల మోటార్లు వాడుతున్నామన్నారు. ఈ ప్రాజెక్టు కోసం 26 వేల ఎకరాల భూమిని సేకరించామన్నారు. అత్యంత వేగంగా ప్రాజెక్టు నిర్మాణ పనులు సాగుతున్నాయన్నారు. మాతాశిశు సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం వైద్యం రంగంలో సమూల మార్పులు తెచ్చిందన్నారు. మ్యానిఫెస్టోలో పెట్టని హామీలను సైతం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారన్నారు. గత సంవత్సరం తెలంగాణలో 3 కోట్ల టన్నుల వరి పండిస్తే కేంద్ర ప్రభుత్వం తీసుకునేందుకు సిద్ధంగా లేదన్నారు. వానకాలంలో వరి పంటను సాగుచేసి మిగతా సీజన్లో వాణిజ్య పంటలపై దృష్టి సారించాలని సీఎం రైతులకు సూచించారన్నారు. సంవత్సరానికి 2కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఈ ఏడేండ్లలో 14కోట్ల ఉద్యోగాలు భర్తీ చేసిందా అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని 30 లక్షల ఉద్యోగాల్లో ఇప్పటికీ 8 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఖాళీగా ఉన్నాయన్నారు. ఉద్యోగాలు ఇవ్వకుండా మోడీ యువతను మోసం చేశారన్నారు. తెలంగాణలో ఏడేండ్లలో లక్షా50వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ఒక్కో గ్రామం నుంచి ఒక్కో బస్సులో తరలిరావాలని పిలుపునిచ్చారు.
తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ను తీర్చిదిద్దాలి
కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష విద్యాశాఖమంత్రి సబితారెడ్డి
బొంరాస్‌పేట, అక్టోబర్ 27 : కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని, మరో 20 ఏండ్లు కేసీఆరే సీఎంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం రాత్రి కొడంగల్ పట్టణంలోని రెడ్డి బసిరెడ్డి ఫంక్షన్ హాలులో నిర్వహించిన నియోజకవర్గ టీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యకర్తల సమయావేశానికి ఆమె ముఖ్య అతిథి హాజరై మాట్లాడారు. దేశంలోనే టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా మారిందని, పార్టీకి కార్యకర్తలే బలమని అన్నారు. కేసీఆర్ ఒక్కరితో ప్రారంభమైన టీఆర్ఎస్ ప్రస్థానం నేడు 60 లక్షల మంది సభ్యులకు చేరిందన్నారు. రైతు బంధు పథకం ద్వారా కొడంగల్ నియోజకవర్గానికి ఏటా రూ.210 కోట్ల పెట్టుబడి సాయం అందుతున్నదని మంత్రి పేర్కొన్నారు. మిషన్ భగరథతో ఇంటింటికి నీరంది మహిళలు సంతోషంగా ఉన్నారని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. త్వరలోనే పాలమూరు ఎత్తిపోతలను పూర్తిచేసి జిల్లాలోని ఆయకట్టుకు సాగునీరు అందుతుందని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ సీఎం కేసీఆర్‌పై అభాండాలు వేస్తున్నదని, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కూడా ధరలు పెరుగుతున్నాయన్న విషయాన్ని కేంద్రం విస్మరిస్తున్నదని మంత్రి విమర్శించారు. వచ్చే నెల 15న వరంగల్‌లో నిర్వహించే విజయ గర్జన సభకు అధిక సంఖ్యలో ప్రజలు తరలి రావాలని మంత్రి పిలుపునిచ్చారు. జడ్పీ చైర్మన్ సునీతా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.
విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి
రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని మంత్రి ఇంద్రారెడ్డి అన్నారు. కొడంగల్‌లో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని, కేజీబీవీ భవనాన్ని ఆమె బుధవారం రాత్రి ప్రారంభించారు.
ప్రపంచమే తెలంగాణ వైపు చూస్తున్నది
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రపంచమే తెలంగాణవైపు చూస్తున్నదని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. రైతులు, ప్రజల కష్టాలు తెలిసిన కేసీఆర్ సీఎం కావడంతో వారి కోసం మంచి పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. పాలమూరు జిల్లాకు సాగునీరు అందించి రూపురేఖలు మార్చారని తెలిపారు. విజయ గర్జన సభకు తాలుకా నుంచి 209 బస్సుల్లో ప్రజలు తరలిరావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కొడంగల్‌లో క్యాంపు కార్యాలయం ప్రారంభించినందున సోమవారం నుంచి గురువారం వరకు ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, జడ్పీ వైస్‌చైర్మన్ విజయకుమార్, ఎంపీపీలు ముద్దప్ప, విజయకుమార్, మధుకర్‌రావు, జడ్పీటీసీలు అరుణాదేశు, నాగరాణి, మహిపాల్, ప్ర కాశ్‌రెడ్డి, బొంరాస్‌పేట వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఉషారాణి, పీఏసీఎస్ చైర్మన్లు విష్ణువర్ధన్‌రెడ్డి, శివకుమార్, రైతు బంధు అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షులు యాదగిరి, దామోదర్‌రెడ్డి, ప్రమోద్‌రావు, హన్మంత్‌రెడ్డి, వెంకటయ్య, నాయకులున్నారు.